బిజెపి ప్రచారంకు స్వామి పరిపూర్ణానంద సిద్దం

శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద బిజెపిలో చేరి పార్టీ ఎన్నికల ప్రచారానికి సారధ్యం వహించేందుకు రంగం సిద్దమవుతున్నది. తాజాగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో భేటీ అయిన పరిపూర్ణానంద బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. అమిత్ షా ఆదేశాల మేరకు తన ప్రచారం ఉంటుందని భేటీ అనంతరం వెల్లడిస్తూ నవరాత్రులు పూర్తయిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.

 ‘నా భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. నా ఆసక్తి ప్రధానం కాదు. అమిత్ షా ఆలోచనలు, నిర్ణయాలు, అభిప్రాయాల మేరకు ప్రచారం ఉంటుంది. నవరాత్రులు అయిపోయాక దీనిపై పూర్తిగా చర్చిస్తాం. ఆధ్యాత్మికం, రాజకీయం వేరు కాదు’ అని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. నవరాత్రి ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత మరోసారి అమిత్ షాతో పరిపూర్ణనంద సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ప్రచారం చేయాలా లేక రెండు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు బాధ్యతలు అప్పగించాలా అన్న అంశంపై బీజేపీ పెద్దలతో స్వామి సోమవారం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

బిజెపి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇటీవల ఆయన పేరు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో బిజెపి అగ్రనేతలతో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. అమిత్‌షా ఏం సూచిస్తే దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని చెబుతూ  ప్రచారమా.. బాధ్యతలా ఏవైనా అమిత్‌షా నిర్ణయం మేరకే ఉంటుందని ఆయన తేలిపారు. 

అంతకుముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తోనూ పరిపూర్ణానందన స్వామి భేటీ అయి చర్చించారు. శ్రీరాముడి విషయంలో కత్తి మహేశ్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా యాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించిన పరిపూర్ణానందను హైదరాబాద్‌ పోలీసులు గృహనిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నగర బహిష్కరణ విధించారు.

అయితే, ఈ బహిష్కరణపై హైకోర్టు స్టే విధించడంతో పరిపూర్ణానంద తిరిగి నగరంలో అడుగుపెట్టారు. ఈ వ్యవహారంలో హిందూ సెంటిమెంట్‌కు అనుకూలంగా పరిపూర్ణానంద వ్యవహరించారని, బీజేపీ తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తే.. హిందూ సెంటిమెంట్‌తో మరింత లాభపడవచ్చునని ఆ పార్టీ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్‌ తరహాలో తెలంగాణలో స్వామి పరిపూర్ణానంద ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపే అవకాశముందని ప్రచారం కూడా ఈ సందర్భంగా సాగుతోంది.