ఎమ్యెల్సీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ షాక్!

ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలి అంటే ఈ నెల 27 లోగా శాసన మండలికి ఎన్నిక కావడం అనీవార్య పరిస్థితులలో చిక్కుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా శాసన మండలికి జరుగవలసిన ఎన్నికలు వాయిదా పడడంతో గవర్నర్ కోటా నుంచి సీఎం ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ కేబినెట్ తీర్మానం చేసింది. 

అయితే నెల రోజులు దాటినా గవర్నర్ కోషియారీ దీనిపై స్పందించలేదు. దీంతో ఒక్కసారిగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో ఈ విషయంపై జోక్యం చేసుకోవాలంటూ ఉద్ధవ్ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని కోరడం తెలిసిందే. 

ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఎన్నికలను మరెక్కడా ఇంకెవరకు జరపడానికి సిద్దపడని ఎన్నికల కమీషన్ మాత్రం మహారాష్ట్రలో ఈ నెల 21న జరపడానికి షెడ్యూల్ విడుదల చేసింది.దానితో శివసేన నేతలు ఉపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం నామినేషన్ల పక్రియ జరుగుతున్నది. 

మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా బిజెపి నుండి నలుగురు, శివసేన, ఎన్సీపీ లనుండి ఇద్దరు చొప్పున, కాంగ్రెస్ నుండి ఒక్కరు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆ మేరకు అభ్యర్థులను నిలబెట్టడానికి సిద్దపడగా ఎన్నికలు ఏకగ్రీవమని అందరు ఆశించారు. 

అయితే అకస్మాత్తుగా కాంగ్రెస్ ఒక్కరికి బదులు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో శివసేన నేతలు దిగ్బ్రాంతికి గురయ్యారు. వారిద్దరూ నామినేషన్లు వేస్తే ఎన్నికలు అనివార్యం కాగలవు. ఎన్నికలు అంటూ జరిగితే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇటువంటి పరిస్థితులు సహజంగానే శివసేన వారిని అసహననాయికి గురిచేస్తున్నాయి. 

ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం వహిస్తున్న మహా వికాస్ అగాఢీ కూటమిలో కాంగ్రెస్ కూడా భాగస్వామి కావడం గమనార్హం. కూటమి నిర్ణయానికి భిన్నంగా కాంగ్రెస్ అదనంగా మరో అభ్యర్థిని పోటీకి నిలబెట్టడం రాజకీయంగా దుమారం రేపుతున్నది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అస్థిర పరచడమే కాంగ్రెస్ ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది. 

వాస్తవానికి కాంగ్రెస్ అధిష్టానానికి శివసేన నాయకత్వంలోని ప్రభుత్వంలో చేరడం ఇష్టం లేదు. కానీ ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ప్రోద్భలంపై, పైగా కాంగ్రెస్ ఎమ్యెల్యేలలో అత్యధికులు వత్తిడి తేవడంతో ఒప్పుకొనక తప్పలేదు. అయినా కాంగ్రెస్ విషయంలో ఉద్ధవ్ ఠాక్రే అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా `హిందూత్వ ఎజెండా'  విషయంలో కాంగ్రెస్ తో రాజీకి సిద్దపడటం లేదు. 

కేవలం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని శ్శిరత్వం కావించడం కోసమే కాంగ్రెస్ అధిష్టానం ప్రోద్భలంపైననే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతున్నది. పైగా తమ రెండో అభ్యర్థిని పోటీ నుండి విరమించే ప్రసక్తి లేదని కాంగ్రెస్ స్పష్టం చేస్తున్నది.