మరోసారి సీఎంలతో ప్రధాని మోదీ భేటీ 

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌-3 కొనసాగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎంలతో ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ అమలుపై చర్చిస్తారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరుపుతారు. 

సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరుపనున్నారు.  ఈ నెల 17న లాక్‌డౌన్-3 ముగియనున్న తరుణంలో మోదీ సీఎంలతో జరిపే వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.   

ఇలా ఉండగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూన్ చివరి వారంలో లేదంటే జులై మొదటి వారంలో జరిగే అవకాశాలున్నాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమౌతాయని అంతా అనుకున్నారు. అయితే అనుకున్న సమయానికే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని స్పీకర్ చెప్పారు.

 వర్షాకాల సమావేశాలు జూన్ నెలాఖరు కావడంతో అప్పటికి లాక్‌డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తివేసే అవకాశం ఉంది. లాక్‌డౌన్ ఎత్తివేస్తేనే పార్లమెంట్ సమావేశాలకు అవకాశం ఏర్పడుతుంది.