వామపక్ష సలహాదారులపై ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ లో దుమారం

15 సంవత్సరాల అనంతరం అధికారంలోకి రావడంతో ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కార్యకర్తలలో తొలుత నెలకొన్న  ఆసక్తి ఒకటిన్నర సంవత్సరమైన తర్వాత ఇప్పుడు పార్టీ సాధారణ కార్యకర్తలలోనే కాకుండా సీనియర్ నేతలలో సహితం కనబడటం లేదు. 

అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అధికారం కొద్దిమందిలో కేంద్రీకృతమై ఉంటున్నది. ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ తో సమాన హోదా ఆకలిగిన టి ఎస్ సింగ్ దేవ్, తామ్రధ్వజ్ సాహు, చరణ్  దాస్ మహంత్ వారు నేడు అసలు కనిపించడం లేదు. క్షేత్రస్థాయి పార్టీ కార్యకర్తలు తమ పార్టీ పాలన ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు.  

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2013, 2014 లలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపారు. విద్యార్థి నేతల నుండి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు జైళ్లకు కూడా వెళ్లారు. కానీ అధికారం వచ్చాక వారెవ్వరికి అవకాశం లభించక పోవడం, బైట నుండి వచ్చిన వామపక్ష ఆలోచనాపరులకు ఎక్కువ అవకాశాలు  లభిస్తూ ఉండడంతో తమాయించుకోలేక పోతున్నారు. 

ఛత్తీస్‌గఢ్ లో ఇప్పుడు అధికారం అంతా  ముఖ్యమంత్రి, ఆయన చుట్టూ ఉన్న వామపక్ష సలహాదారులలోనే కేంద్రీకృతం అవుతున్నది.  కాంగ్రెస్ నేతలను అసలు పట్టించుకోకుండా, ఇతర రాష్ట్రాలకు చెందిన వామపక్ష సంస్థల నుండి సలహాలు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వామపక్షాల ఆలోచనాపరులు చొచ్చుకు రావడం పట్ల ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు తమను హిందూ వ్యతిరేకి, జాతీయ వ్యతిరేకి, పాకిస్థాన్ అనుకూలురు అంటూ నిందిస్తూ ఉండడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు శిబిరాలుగా విడిపోయిన్నట్టు కనిపిస్తున్నది. ఒక శిబిరం వామపక్ష విధానాలు ఆవలంభిస్తుండగా, మరో శిబిరం జాతీయవాద భావాలు  కలిగి ఉంది. రాష్త్ర కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. వామపక్ష శిబిరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి భూపేష్ బాగల్, కాంగ్రెస్ లోని జాతీయవాద భావాలకు  ప్రాతినిధ్యం వహిస్తున్న టి ఎస్ సింగ్ దేవ్ ల మధ్య అసలు పొసగడం లేదు. 

కాంగ్రెస్ లో అత్యధికులు జాతీయవాద భావాలు  కలిగిన వారు కావడంతో ముఖ్యమంత్రి  తన పదవి పట్ల తరచూ అభద్రతా భావానికి గురవుతున్నారు. బైటనుండి వచ్చిన వామపక్ష అనుకూలురకు కీలకమైన పదవులు కట్టబెడుతూ ఉండడంతో క్షేత్రస్థాయి కాంగ్రెస్ నేతలలో తీవ్రమైన అసంతృప్తి రగులుతున్నది. ఈ పరిస్థితులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.