దేశంలో 63 వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు రోజు రోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హమ్మారి బారిన‌ప‌డిన వారి సంఖ్య 63 వేల‌కు చేరువైంది. రెండు వేల మందికి పైగా ఈ వైర‌స్ కు బ‌ల‌య్యారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 3277 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి ఒక్క రోజులోనే కొత్త‌గా 127 మంది మ‌ర‌ణించారు. 

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో క‌రోనా ప‌ర‌స్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉద‌యం బులిటెన్ విడుద‌ల చేసింది. కొత్త‌గా న‌మోదైన 3277 కేసులతో క‌లిపి దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బాధితుల సంఖ్య 62,939కి చేరింది. 

గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌ర‌ణించిన 127 మందితో క‌ల‌పి మొత్తంగా 2019 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 19358 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 41,472 మంది చికిత్స పొందుతున్నారు.

ఇలా ఉండగా, నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కరోనా బారిన పడినవారంతా ఆరోగ్యవంతులయ్యారు. ఇప్ప‌టికే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, గోవా, మ‌ణిపూర్ ల‌లో రోగులంతా కోలుకోగా, తాజాగా మిజోరం రాష్ట్రంలో క‌రోనా బారిన‌ప‌డిన ఒకే ఒక్క రోగి కూడా  జ‌బ్బున‌య‌మై డిశ్చార్జ్ అయ్యారు.

కేంద్ర పాలిత ప్రాంత‌మైన అండ‌మాన్ నికోబార్ లోనూ మొత్తం 33 మంది రోగులు  కోలుకుని ఇంటికి చేరారు. అన్ని కేసులు క్లియ‌ర్ అయిన ఈ ఐదు చోట్ల ఒక్క మ‌ర‌ణం కూడా లేక‌పోవ‌డం విశేషం.

దేశంలోనే అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో 20228 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అందులో 779 మంది మ‌ర‌ణించగా.. 3800 మంది డిశ్చార్జ్ అయ్యారు. గుజ‌రాత్ లో 7796, ఢిల్లీలో 6542, త‌మిళ‌నాడులో 6535 మందికి వైర‌స్ సోకింది. 

రాజ‌స్థాన్ లో 3708, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 3614, యూపీలో 3373 కేసులు న‌మోద‌య్యాయి. ఏపీలో 1930, ప‌శ్చిమ బెంగాల్ 1786, పంజాబ్ లో 1762, తెలంగాణ‌లో 1163, జ‌మ్ము క‌శ్మీర్ లో 836, క‌ర్ణాట‌క‌లో 794 మందికి క‌రోనా వైర‌స్ సోకింది.