గ్యాస్ లీకేజీ పూర్తిగా మానవ తప్పిదమే  

విశాఖపట్నంలో జరిగిన గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన పూర్తిగా మానవ తప్పిదమే అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. దుర్ఘటన సంభవించిన తీరు, స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం కంపెనీ యాజమాన్యం బాధ్యతారాహిత్యం వల్లే జరిగినట్లు స్పష్టమవుతోందని తెలిపారు. 

ఘటనాస్థలికి వెళ్లి, బాధితులను పరామర్శించి వచ్చిన కన్నా సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీని, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్రాసిన లేఖలో డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. 

వేలాది మంది బాధితులకు భవిష్యత్తులో కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున శాశ్వత హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని కన్నా సూచించారు. 

ఇలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, లోతైన విచారణ జరిపించాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి వ్రాసిన లేఖలో కోరారు. 

ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని మోదీ జోక్యం చేసుకుని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, నేవీతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అ ప్రమత్తం చేయడం వల్లే ప్రమాదం తీవ్రత తగ్గిందని అంటూ  టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతలు కింజరాపు అచ్చెన్నాయుడు,  నిమ్మల రామానాయుడు లతో పాటు మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు   కృతజ్ఞతలు తెలిపారు.