లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై జీహెచ్‌ఎంసీ అప్రమత్తం 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక వంక కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ, హైదరాబాద్ జిల్లా రెడ్ జోన్ పరిధిలో ఉన్నప్పటికీ  లాక్‌డౌన్‌ ఉల్లంఘనలు విచ్చలవిడిగా జరుగుతూ ఉండడం పట్ల జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇదే విధంగా కొనసాగితే పరిస్థితులు అదుపు తప్పగలవని ఆందోళన చెందుతున్నారు. 

నిబంధనలకు విరుద్ధంగా జిమ్‌లు, ఇనిస్టిట్యూట్లు, స్టడీ రూమ్‌లు, స్పోర్ట్స్‌ క్లబ్‌లు, ఫిట్‌నెస్‌ స్టూడియోలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు తెరుస్తున్నారు.  నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అనుమతించిన దుకాణాలు, సంస్థల వద్ద సహితం భౌతికదూరం, మాస్క్‌ ధరించడం తదితర నిబంధనలు పాటించడం లేదు.   

అక్కడక్కడా తనిఖీలు చేస్తూ, కొన్నింటిని సీజ్ చేస్తున్నా రాజకీయ వత్తిడిల కారణంగా కఠినంగా వ్యవహరింపలేక పోతున్నట్లు తెలుస్తున్నది. అయితే పరిస్థితి లాక్ డౌన్ ఉనికికే ప్రమాదం ఏర్పడడంతో సోమవారం నుండి విస్తృతంగా తనిఖీలు చేపట్టేందుకు సిద్దపడుతున్నారు. 

సికింద్రాబాద్‌, శేరిలింగంపల్లి, చార్మినార్‌, ఎల్‌బీనగర్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌ తదితర జోన్ల పరిధిలో 140 దుకాణాలు/సంస్థలను సీజ్‌ చేశామని అధికారులు చెబుతున్నారు. వీటిల్లో జిమ్‌లు, స్టడీ రూంలు, ఫిట్‌నెస్‌ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి. సడలింపుల నేపథ్యంలో తెరుస్తోన్న సూపర్‌ మార్కెట్లు, కిరాణ, మెడికల్‌ షాపులు, మద్యం దుకాణాలు, హార్డ్‌వేర్‌ తదితర దుకాణాలు కూడా నిబంధనలు పాటించాల్సిదేనని స్పష్టం చేస్తున్నారు.