సిటీ ఆఫ్‌ కంటైన్‌మెంట్‌ జోన్స్‌గా  జాయ్‌ ఆఫ్‌ సిటీ

బ్రిటిష్ వారి హయాంలో భారతీయుల ఆర్ధిక, రాజకీయ రాజధానిగా మాత్రమే కాకుండా దేశం శాస్త్రీయ, సాహిత్య, సాంస్కృతిక వికాసంతో పాటు విప్లవ పోరాటాలకు సహితం కేంద్రంగా ఉన్న కోల్‌కతా నగరంకు సిటీ ఆఫ్‌ జాయ్‌ అనే పేరుంది. కరోనా వైరస్‌ విజృంభనతో ప్రస్తుతం అది సిటీ కంటైన్‌మెంట్‌ జోన్స్‌గా మారింది. 

ఈ చారిత్రక నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసిన కంటైన్‌మెంట్‌ జోన్లే దర్శనమిస్తున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో జనాలు రోడ్లపైకి రాకుండా మొత్తం బారికేడ్లతో నింపివేశారు. కోల్‌కతాలో గత వారం 227 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండగా, ప్రస్తుతం అవి 319కి పెరిగాయి. పశ్చిమబెంగాల్‌లో గత 24 గంటల్లో 11 మంది కరోనా బాధితులు మరణించారు. శనివారం ఒక్కరోజే  108 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

కోల్‌కతాలోని ఇండియన్‌ మ్యూజియంలో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ కరోనాతో మృతిచెందాడు. దీంతో ఆ మూజియాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అందులో పనిచేస్తున్న 30 మంది క్వారంటైన్‌కు తరలించారు. మ్యూజియం చుట్టుపక్కల ప్రాంతాలను కంటైన్‌మెంట్‌గా మార్చారు. 

కోల్‌కతాలో ప్రముఖ మార్కెట్‌ బురా బజార్‌ ను కూడా ఇప్పుడు కంటైన్‌మెంట్‌ జోన్‌గా మార్చారు. ఈ మార్కెట్‌ ప్రతిరోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో లారీలు వస్తుంటాయి. దీంతో ఆయా లారీల్లో ఉండే అందరికి కరోనా పరీక్షలు నిర్వహించలేమని కోల్‌కతా మేయర్‌ ఫిర్హాద్‌ హకీమ్‌ నిస్సహాయత వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 1678 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 160 మంది బాధితులు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు మూడు వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత నెలలో ఈ సంఖ్య 250గా ఉంది. శనివారం నిర్వహించిన పరీక్షల్లో 4.54 శాతం కరోనా పాజిటివ్‌గా తేలాయి. జాతీయ స్థాయిలో 3.3 శాతం మాత్రమే తేలుతూ ఉండడం గమనార్హం. 

మరోవంక హుద్రోగం వంటి వ్యాధులతో కరోనా కారణంగా మరణించినా వారిని కరోనా మృతుల జాబితాలో చేర్చకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నది. దేశం మొత్తంలో తక్కువ కరోనా పరీక్షలు జరుపుతూ, అత్యహీద్కంగా మృతులు కలిగి ఉన్న నగరంగా పేరు రావడంతో ఈ మధ్యనే కరోనా పరీక్షలను కొంచెం పెంచారు.