ఏపీలో 2,000 చేరువలో ఏపీలో కరోనా కేసులు 

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 2,000 సమీపంకు చేరుకున్నాయి. అయితే గత వారం రోజులుగా పోల్చితే కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. మరో ఆరుగురు   మృతి చెందడంతో, మృతుల సంఖ్య 46కు పెరిగింది. 

తాజా ఆరోగ్య బులెటిన్  ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,388 శాంపిల్స్‌ని పరీక్షించగా 43 మంది కోవిడ్19 పాజిటివ్‌గా తేలారు. 45 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం‌తో డిశ్చార్జ్ అయ్యారు. కృష్ణ‌ా జిల్లాలో ఇద్దరు, కర్నూల్‌లో ఒకరు చనిపోయారు. 

13 జిల్లాలకు గానూ 7 జిల్లాల్లో ఒక్క కేసు నమోదుకాకపోవడం విశేషం. అయితే 6 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.  ఇప్పటి వరకు  మొత్తం 1930 కేసులు నమోదుకాగా, చికిత్స పొందుతున్నవారు 999 మంది, డిశ్చార్జ్ అయినవారు 887 మంది ఉన్నారు. 

కాగా, విజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. బలిజిపేట మండలం చిలకపల్లికి చెందిన వృద్ధురాలు కరోనాతో మృతి చెందినట్లు నిర్ధారించారు. కిడ్నీ వ్యాధి చికిత్స కోసం విశాఖపట్నం వెళ్లిన వృద్ధురాలికి పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు. విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందింది.   

అనంతపూర్ జిల్లాలోని విడపనకల్లు క్వారంటైన్ కేంద్రంలో శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతతో వృద్ధురాలు గోవిందమ్మ మృతి చెందింది.