జమిలి ఎన్నికలకు బిజెపి మద్దతు

 

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించిన విధంగా పార్లమెంట్, అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు జరపని ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నట్లు బిజెపి ఈ అంశంపై పరిశీలన జరుపుతున్న లా కమీషన్ కు తెలిపింది. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నాక్వి ఆధ్వర్యంలో బిజెపి ప్రతినిధి వర్గం లా కమీషన్ చైర్మన్ జస్టిస్ బి ఎస్ చౌహన్ ను కలిసి పార్టీ అభిప్రాయాన్ని తెలిపింది. ఈ ప్రతినిధి వర్గంలో పార్టీ నేతలు వినయ సహస్రబుద్దే, భూపేందర్ యాదవ్, అనిల్ బాలుని ఉన్నారు.

 

ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుపుతూ ఉండటం ఆర్ధిక, మానవ వనరులను వృద్ధ చేయడమే అని బీజేపీ స్పష్టం చేసింది. ప్రధాన మంత్రి మోడీ గత నాలుగేళ్లలో ఈ అంశాన్ని పలు సార్లు ప్రస్తావించారు. లా, జస్టిస్ పార్లమెంటరీ కమిటీ సహితం అందుకు సానుకూలత వ్యక్తం చేస్తూ డిసెంబర్, 2015లో సిఫార్సు చేసింది.

 

భూపేందర్ యాదవ్ ఇదివరలో పార్లమెంట్ లో ప్రతిపాదించిన ప్రైవేట్ సభ్యుని బిల్ లో విడివిడిగా ఎన్నికలు జరగడం వల్లన సుస్థిరత, పరిపాలన దెబ్బ తింటుందని, ఎన్నికల సమయంలో ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు చేపట్టడానికి అడ్డంకిగా మారుతుందని, ఆర్ధిక ప్రగతి కుంటుపడుతుందని పేర్కొన్నారు.

 

అయితే కాంగ్రెస్ తో పాటు యూపీఏలో పలు భాగస్వామ్య పక్షాలతో పాటు, ఎన్డీయే లోని కొన్ని పక్షాలు సహితం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. వాటిల్లో అన్నాడియంకె, డీయంకే,ఆప్, తృణమూల్ కాంగ్రెస్, టిడిపి, జేడీఎస్, యంఐయం, సిపిఐ, సిపియం, గోవా ఫార్వర్డ్ పార్టీ ఉన్నాయి. కానీ, బిజెడి, జెడియు, ఎస్పీ, అకాలీదళ్,  టి ఆర్ ఎస్, వైసిపి వంటి పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను సమర్ధించాయి.