వలస కూలీలకు మమతా అన్యాయం.. అమిత్ షా ఫైర్ 

వలస కూలీలను తరలించే ‘‘శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌” రైళ్లకు బెంగాల్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఘాటుగా  లేఖ రాశారు. 

లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల తరలింపుకు అనుమతి ఇవ్వకపోవడం అన్యాయమని షా విమర్శించారు. ఇప్పటి వరకు 2లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారని చెప్పారు. 

బెంగాల్‌లో చిక్కుకుపోయిన వలస కార్మికులు కూడా వారి ఊళ్లకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని, కానీ పశ్చిమబెంగాల్‌ సర్కార్‌‌ అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. దీని వల్ల కార్మికులు చాలా అవస్థలు పడుతున్నారని చెప్పారు.  

‘‘పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం నుంచి ఆశించినంత సహకారం లభించడం లేదు. రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. పశ్చిమ బెంగాల్‌ వలస కార్మికులకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ తీరు వారికి మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది’’అని అమిత్‌ షా లేఖలో పేర్కొన్నారు.   

మమత సర్కారు వ్యవహార శైలి ఇలాగే ఉంటే వలస కార్మికుల బతుకులు మరింత దుర్భరంగా మారే అవకాశం ఉందని చెబుతూ భవిష్యత్తులో వాళ్లంతా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అమిత్ షా హెచ్చరించారు. ఇప్పటికైనా రైళ్లను అనుమతించండని షా లేఖ‌‌లో మమతాను కోరారు. 

కరోనా విషయంలో పశ్చిమబెంగాల్‌ సర్కార్‌‌, కేంద్ర మధ్య మొదటి నుంచివివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా సంక్షోభం ప్రారంభం నుంచి కేంద్రం పశ్చిమ బెంగాల్, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ‌  వాస్తవాలను దాచి ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మరణాలను తక్కువగా చేసి చూపిస్తున్నట్లు ఆ రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం అభ్యంతరం తెలిపింది.