తెలంగాణలో లాక్ డౌన్ పేరుకే... ఎక్కడ చూసినా జనమే

తెలంగాణలో ఈ నెల 29వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించినా, ఆయన ఇచ్చిన సడలింపులు కారణంగా ఎక్కడా లాక్ డౌన్ ప్రభావం కనిపించడం లేదు. ఎక్కడ చూసినా  ప్రజలు యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు. బైక్‌లపై ఇద్దరు-ముగ్గురు, కార్లలో నలుగురు-ఐదుగురు ప్రయాణిస్తున్నారు. 

మద్యం షాపులు, కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్ల వద్ద భౌతిక దూరం నిబంధన గాలికి పోయింది. మునిసిపల్ ప్రాంతాలలో దుకాణాలకు సరి, బేసి అంకెలను వేసి రోజు విడిచి రోజు తెరవాలని ఆంక్షలు విధించినప్పటికీ.. చాలా చోట్ల అమలుకు నోచుకోలేదు. నో మాస్క్‌... నో సేల్‌ పేరిట బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ అటు.. వ్యాపారులుగానీ, ఇటు వినియోగదారులుగానీ మాస్కులు ధరించడం లేదు. 

చాలా దుకాణాల్లో శానిటైజర్లను   ఏర్పాటు చేయలేదు. రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుదీర్ఘ విరామం తర్వాత శుక్రవారం ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఆన్‌ అయ్యాయి. ఫ్లై ఓవర్లన్నీ తెరవడంతో మహానగర జంక్షన్లన్నీ వాహనదారులతో జామ్‌ అయ్యాయి. అక్కడక్కడా వాహనాలు తనిఖీ చేసి చలానాలు విధించినా.. మెజారిటీ ప్రాంతాల్లో పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరించారు. సాధారణ ట్రాఫిక్‌తో పోలిస్తే దాదాపు 40 శాతం వాహనాలు రోడ్లపై కనిపించాయి.

ఇలా ఉండగా, లాక్ డౌన్ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలను సీజ్ చేసిన పోలీసులు తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ రెండు లక్షల వాహనాలను సీజ్ చేశారు. కాగా ఇప్పటికే హైదరాబాద్‌లో 34 వేల టూవీలర్లను పోలీసులు వెనక్కి సీజ్ చేసిన వాహనాలు వెనక్కి ఇచ్చేశారు. 

వాహనాలపై గతంలో నమోదైన చలానాలను చెల్లించుకొని యజమానులకు తిరిగి ఇచ్చేయనున్నారు. మొదటిసారి చలానా పడిన వాహనాలపై సెక్షన్ 179 కింద కేసు నమోదు చేసి రూ. 500 జరిమానా కట్టించుకొని వెనక్కి ఇచ్చేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. విచ్చలవిడిగా తిరిగేందుకు ఈ విధంగా ఇస్తున్నట్లు కనబడుతున్నది.