కేసీఆర్ క్వారంటైన్ ముఖ్యమంత్రి

పేదలు ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో నుంచి బయటకురారని కేసీఆర్ క్వారంటైన్ ముఖ్యమంత్రి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆరు సంవత్సరాలుగా కేసీఆర్ క్వారంటైన్‌లోనే ఉన్నారని, అప్పుడప్పుడు నేను బతికే ఉన్నాన‌ని చెప్పేందుకు బయటకి వస్తారని, ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెడతారని అంటూ ధ్వజమెత్తారు. 

ప్రజలను-రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని సంజయ్ మండిపడ్డారు. కోటి టన్నుల ధాన్యం సేకరిస్తా అన్న సీఎం ఇప్పటి వరకు 20 టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవసాయ బులిటెన్ విడుదల చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం  ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

దేశంలో 17 రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదో ర‌కంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నాయని, తెలంగాణ సీఎం మాత్రం తాము ధాన్యం సేక‌రించ‌కుంటే ప‌రిస్థితి ఏంట‌ని రైతుల‌ని బెదిరిస్తున్నార‌ని సంజ‌య్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విష‌యంలో‌ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వర్తిత్వం మాత్రమే వ్యవహరిస్తుంద‌ని, ఒక్క‌ రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని దుయ్యబట్టారు. 

గన్ని బస్తాలు, రవాణా చార్జీలు … ఇలా ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందని సంజయ్ గుర్తు చేశారు. రైతు పంట దగ్ధం చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే అది  ఈ ప్రభుత్వ చేతకాని తనమ‌ని సంజయ్ విమర్శించారు. కేంద్ర నిధుల మీద ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరోవంక కేసీఆర్ నిర్ణయాల వల్ల హైదరాబాద్‌లో క‌రోనా కేసులు పెరిగాయని సంజయ్ మండిపడ్డారు.టెస్టులు జరగాలని కేంద్రం అంటుంటే కేసీఆర్ మాత్రం తన పేరు కోసం టెస్టులను తగ్గించారని ధ్వజమెత్తారు. లాక్ డౌన్ లో రోడ్ల మీద బరితెగించి తిరుగుతున్న వారి కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు.

పాతబస్తీలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం జరపడం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ, అందుకు బాధ్యుడైన ఎంఐఎం  గుండా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు, రేపిస్ట్ లకు అడ్డాగా పాతబస్తీని  మార్చిన పార్టీకి  రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సంజయ్ ఆరోపించారు.