గ్యాస్ లీకేజిపై కఠిన చర్యలకు ప్రధాని ఆదేశం 

విశాఖ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించారు.  లీకేజీకి పాల్పడి, ప్రజల ప్రాణాలను బలిగొన్న పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంపై విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. 

ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీలో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కేంద్ర రసాయనశాఖ కార్యదర్శి ఉంటారు. గ్యాస్‌ లీకేజీ ప్రభావాన్ని నియంత్రించడంతోపాటు బాధితులకు సహాయం చేయడంపై ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందని ప్రధాని ట్విట్టర్‌లో తెలిపారు. 

బాధితులు త్వరితగతిన కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ప్రమాద వార్త చేరగానే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను తొలుత ప్రధాని అప్రమత్తం చేశారు. 

ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న మరుక్షణమే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, సంబంధిత ఉన్నతాధికారులతో మోదీ మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీసారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు. 

మరణాల సంఖ్య పెరగకుండా ఎమర్జెన్సీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతీయ విపత్తుల నిర్వహణ (ఎన్డీఆర్‌ఎఫ్‌) దళాలు, నౌకాదళాలను తరలించాలని సంబంధిత ఉన్నతాధికారులను కోరారు. తర్వాత ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. 

ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా,  రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎన్టీఆర్‌ఎఫ్‌, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

విశాఖపట్నంలో గ్యాస్‌ లీకేజీకి దారి తీసిన పరిస్థితులను ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రమాద తీవ్రత, పరిశ్రమ యాజమాన్యం, వాతావరణ కాలుష్య నియంత్రణ సంస్థల అలసత్వం తదితర అంశాలతోపాటు మృతులు, బాధితులు, వైద్యసహాయక చర్యలపై చర్చించారు