తెలంగాణలో లాక్ డౌన్ బేతఖార్!

తెలంగాణాలో ఇప్పుడు  లాక్ డౌన్ నిబంధనలను ఎవ్వరు ఖాతరు చెయ్యడం లేదు. మూడో విడత  లాక్ డౌన్ నిబంధనలు ప్రారంభమైనప్పటి నుండి ఎవ్వరు పట్టించుకోవడం లేదు. రెండు, మూడు రోజులుగా లాక్ డౌన్ ఉన్న సూచనలే  కనిపించడం లేదు. 

రూల్స్ బ్రేక్ అవుతున్నాయి. ఫస్ట్, సెకండ్ ఫేజ్ లాక్ డౌన్ తో పోలిస్తే ప్రభుత్వం కూడా ఇప్పుడు సీరియస్ గా ఉన్నట్లు లేదు. చివరకు రెడ్ జోన్ లలో సహితం యధేచ్చగా జనం తిరగడం కనిపిస్తున్నది. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. వాహనాల భారీగా తిరుగుతున్నాయి. 

కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రెడ్ జోన్ గా ఉన్న  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సహితం  గత రెండు రోజుల్లో లాక్ డౌన్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. రెడ్ జోన్లయిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని చెక్ పోస్టుల వద్ద వాహనాల తనిఖీ నామమాత్రంగానే ఉంటున్నది. దీంతో నిత్యావసరాలు, హెల్త్ ఎమర్జెన్సీ పేరుతో బయటకు వచ్చే వారితోపాటు మద్యం షాపుల కోసం, నిర్మాణ పనులకోసం అంటూ జనం తిరుగుతున్నారు.

రెడ్ జోన్ల నుంచి విచ్చలవిడిగా వాహనాల రాకపోకలు సాగుతుండడంతో ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల బోర్డ‌ర్ చెక్ పోస్టుల వద్ద గత రెండు, మూడు రోజులుగా ప్రయాణించిన వాహనాల డేటాను సేకరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. 

గ్రేటర్ లో కరోనా పూర్తిగా కంట్రోల్ కాకపోవడంతో ఇలాంటి ప్రయాణాల వల్ల గ్రీన్ జోన్లకు వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని సుమారు 12 చెక్ పోస్ట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. 

ఎమర్జెన్సీ సర్వీసులు మినహా ఇతర అవసరాల కోసం పాసులు తీసుకుని ప్రయాణిస్తున్న వారిని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసరాల కోసం తీసుకున్న పాసులతో చాలామంది జిల్లాలు దాటుతున్నారని గుర్తించారు. ఇలాంటి పాసులతో రెడ్ జోన్స్ నుంచి గ్రీన్ జోన్లకు ట్రావెల్ చేయడం వల్ల కరోనాను క్యారిచేసే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.

ఇక మద్యం షాపుల వద్ద మందుబాబులు చేస్తున్న హడావుడి అంత ఇంత కాదు. వారిని అదుపు చేయడం పోలీసులకు తలకు మించిన పనవుతున్నది. పోలీసులు ఎక్కువగా లాక్ డౌన్ అమలు పట్ల కన్నా మద్యం షాపుల వద్దనే కన్ను వేయవలసి వస్తున్నది.