భారత్ లో కరోనా తీవ్రరూపం దాలుస్తున్నదా!

ఇప్పటి వరకు కరోనాను కట్టడి చేయడంలో ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుతూ వస్తున్న భారత్ లాక్ డౌన్ మూడవదశలో ప్రవేశించిన తర్వాత కొన్ని ప్రతికూల అంశాలను ఎదురు చూడవలసి వస్తున్నది. 

ముఖ్యంగా లాక్ డౌన్ అమలులో ఉండగానే మద్యం దుకాణాలు తెరుచుకొంటూ ఉండడం ఇప్పటి వరకు సాధించిన విజయాలు తిరగబడుతున్నాయా అనే అనుమానాలకు  దారితీస్తుంది. ఈ పరిణామం రాష్ట్రాలకు ఆదాయ వనరులు  సమకూర్చేందుకు దోహదపడుతున్నాయి ప్రజారోగ్యం దృష్ట్యా ప్రమాదకరమైనదిగా పలువురు భావిస్తున్నారు. 

ఇలా ఉండగా, రత్‌లో కరోనా వ్యాప్తికి సంబంధించి ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గుల్జేరియా కీలక హెచ్చరిక చేశారు. జూన్, జూలై నెల్లలో భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. 

భారత్‌లో కరోనా కేసుల పెరుగుదల రేటు నిలకడగా ఉందని, కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. అయితే.. భారత్‌లో కరోనా ఎప్పుడు తీవ్రరూపం దాల్చుతుందో కచ్చితంగా చెప్పలేమని కానీ ప్రస్తుతం పెరుగుతున్న కేసుల ఆధారంగా జూన్, జూలైలో కరోనా మరింత ప్రభావం చూపే అవకాశముందని గుల్జేరియా తెలిపారు. 

భారత్‌లో పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరగడానికి టెస్ట్‌ల సంఖ్య పెరగడమే కారణంగా ఆయన చెప్పుకొచ్చారు. రెడ్ జోన్స్, కరోనా హాట్‌‌స్పాట్స్, కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

కరోనా ప్రభావిత దేశాలైన చైనా, ఇటలీలో కూడా లాక్‌డౌన్, భౌతిక దూరం పాటించడం వల్ల నెల తర్వాత ఫలితాలు కనిపించాయని ఆయన చెప్పారు. భారత్‌లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952కు చేరింది. మరణాల సంఖ్య 1,783కు చేరింది. భారత్‌లో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 35,902.

కరోనా కేసులు రెట్టింపు కావడంలో రోజుల వ్యవధి పెరుగుతూ ఉండడం మనం సాధిస్తున్న గొప్ప విజయం అంటూ ఆరోగ్య శాఖ జాయింట్ కార్యదర్శి లవ్ అగర్వాల్ చెబుతూ రావడం తెలిసిందే. కేసులు  రెట్టింపు కావడానికి 12 కు పైగా రోజులు  పడుతూ వస్తున్నదని చెబుతూ వచ్చారు. లాక్ డౌన్ ప్రారంభమైన మార్చ్ 25 ప్రారంభంలో అందుకు మూడు రోజులే పడుతూ ఉండెడిది.   

అయితే ఇప్పుడు మొత్తం కేసులు 50,000 కు చేరుకున్న సమయంలో చూస్తే కేసులు రెట్టింపు కావడానికి ఇప్పుడు అంతగా సమయం పట్టడం లేదనిపిస్తున్నది. ఇప్పుడు ముంబై నగరంలోనే 10,000 కు మించి కేసులు ఉన్నాయి.

మొదటి 10,000 కేసులు చేరుకోవడానికి ఒకటిన్నర నెల రోజులు పడితే, ఇప్పుడు 40,000 నుండి 50,000 కు చేరుకోవడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పట్టింది.  ఈ పరిణామం ఆందోళన కలిగిస్తున్నది. అంతర్జాతీయంగా కరోనా కేసులు ఎక్కువగా గల దేశాలలో భారత్ 13వ స్థానంలో ఉంది.