యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి... బిజెపి ఆరోపణ 

విశాఖ గ్యాస్ లీకేజీలో యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తోందని  బీజేపీ నేత, మాజీ ఎమ్యెల్యే  విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. 

యాజమాన్యం వైపు నుంచి కొంతమంది మాట్లాడుతూ.. కెమికల్ స్టోర్ చేశామని, 45 రోజులు దాటిందని, రియాక్షన్స్ ఉంటాయని, కంపెనీ తెరవటానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెబుతున్నారని.. ఇది వాస్తవమా? కాదా? అన్నదానిపై విచారణ చేయాలని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేసారు. 

45 రోజుల తర్వాత కెమికల్ రియాక్ట్ అయి గ్యాస్ రూపంలో బయటకు వచ్చే పరిస్థితి ఉందని ఇంజనీర్లు చెప్పినప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే వెంటనే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని, కనీసం మీడియా దృష్టికైనా తీసుకువెళ్లి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పాలని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.