విశాఖ గ్యాస్‌ లీక్‌ పై జగన్ కు ప్రధాని ఫోన్  

 విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. విశాఖపట్నం పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్న ప్రధాని అన్ని రకాల సహాయ సహకారాలను, మద్దతు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు. 

అంతకుక్రితం విశాఖ గ్యాస్‌ లీక్‌పై ప్రధాని మోదీ హోంమంత్రిత్వ శాఖ అధికారులు అదేవిధంగా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి అధికారులతో మాట్లాడారు. విశాఖవాసుల క్షేమం కోరుతూ ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. 

విశాఖలో పరిస్థితిపై సమీక్షించేందుకు ప్రధాని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి అధికారులతో ఈ ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. 

''అక్కడి పరిస్థితలను తెలుసుకున్నానని, అధికారులతో చర్చించానని'' ప్రధాని మోడీ అన్నారు. ''విశాఖపట్నంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను'' అని చెప్పారు. 

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల తరలింపులో రెడ్‌క్రాస్ వాలంటీర్‌ల సేవలను వియోగించుకోవాలని సూచించారు. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విశాఖ రెడ్‌క్రాస్‌కు గవర్నర్  ఆదేశాలు జారీ చేశారు.   

కాగా, ఎల్‌జీ పరిశ్రమలో స్టెరైన్‌ అనే రసాయన వాయువు లీకైందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.  ఈ రసాయన వాయువు పీల్చి పలువురు అస్వస్థతకు గురవ్వగా వారిని హుటాహుటిన కేజిహెచ్‌ సహా ఇతర ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. వైద్య సేవలందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని చెబుతూ మరో 48 గంటలపాటు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. 

ఢిల్లీ : విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు. అందరి క్షేమం కోరుతూ, బాధితులు త్వరగా కోలుకోవాలని పేర్కొంటూ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. 

విశాఖ గ్యాస్‌ లీక్‌ విషాదం గురించి వినడం చాలా బాధగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. హెల్త్‌ ప్రొటోకాల్‌ను పాటిస్తూ అధికార యంత్రంగాతో కలిసి పార్టీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.