భారత్ ను ఆదుకోనున్న వ్యవసాయ రంగం 

కరోనా మహమ్మారితో పాటు  లాక్‌డౌన్‌ కారణంగా కుదేలవుతున్న వాణిజ్య, పారిశ్రామిక రంగాలు దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్న సమయంలో వ్యవసాయ రంగం ఈ సంవత్సరం ఒక విధంగా భారత్ ను ఆదుకోగలదని భావిస్తున్నారు.

ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో వృద్ధి రేట్ సహితం గత కొన్ని సంవత్సరాలకన్నా ఎక్కువగా ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది వ్యవసాయ రంగం 3 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తుందని, 2020-21 ఆర్థిక ఏడాదికి దేశ జీడీపీ వృద్ధిలో ఇది 0.5 శాతానికి సమానమని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌ తెలిపారు.  

దేశ వ్యవసాయ రంగంపై కరోనా మహమ్మారి ప్రభావం చూపకపోవడం ఊరట కలిగిస్తున్న అంశమని పేర్కొంటున్నారు. ఈ వానాకాలం, యాసంగి సీజన్‌లో దాదాపు 30 కోట్ల టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తి కానున్నట్టు అంచనా వేస్తున్నారు.

దేశ శ్రామిక శక్తిలో దాదాపు 55 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి పని చేస్తున్నారని, కాబట్టి మార్కెట్‌లో రైతులు అమ్మదలుచుకున్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.