రియాజ్ నైకూ హతంతో కాశ్మీర్ లో ప్రశాంతత 

హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నైకూను మట్టుబెట్టడం వల్ల కశ్మీరు లోయలో మరింత ప్రశాంతత, సుస్థిరత ఏర్పడతాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ భరోసా  వ్యక్తం చేశారు. నైకూను మట్టుబెట్టడం మన భద్రతా దళాలకు గొప్ప విజయమని కొనియాడారు. 

కశ్మీరు లోయలో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నైకూను మట్టుబెట్టడం కచ్చితంగా భద్రతా దళాలకు గొప్ప విజయమని రామ్ మాధవ్  తెలిపారు. ఈ సందర్భంగా భారత సైన్యంలోని రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, జమ్మూ-కశ్మీరు పోలీసులకు అభినందనలు తెలిపారు. 

మూడేళ్ళ నుంచి నైకూ కోసం గాలింపు జరుగుతోందని చెబుతూ  నైకూ చేతులకు అమాయక కశ్మీరీల రక్తం అంటుకుందని పేర్కొన్నారు. అతనిని మట్టుబెట్టడం కచ్చితంగా మరింత ప్రశాంతత, సుస్థిరతకు దారి తీస్తుందని స్పష్టం చేశారు. 

నైకూ ఎనిమిదేళ్ళ నుంచి కశ్మీరు లోయలో చురుగ్గా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. హిజ్బుల్ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలో చేరినప్పటి నుంచి భద్రతా దళాలే లక్ష్యంగా అనేక దాడులు చేయించాడు. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను భద్రతా దళాలు అతడి సొంత గ్రామం బేగ్‌పొరాలోనే మట్టుబెట్టాయి. 

తన తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను చూసేందుకు తన సొంతూరు వస్తున్నట్లు సమాచారం అందడంతో రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, జమ్మూ-కశ్మీరు పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి.