మమతా కరోనా లెక్కలపై బీజేపీ ఫైర్ 

కోవిడ్ - 19 సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్లలో చాలా వ్యత్యాసాలున్నాయంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతిపక్ష బీజేపీ ఫైర్ అయ్యింది. ఇదే విషయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జీ విజయ్ వర్గీయ మమతాకు ఓ లేఖ రాశారు. 

మమత సర్కార్ వాస్తవాలను దాస్తోందని అందరూ విమర్శిస్తున్నా సరే... ఇప్పటికీ బెంగాల్ సర్కార్ కరోనా లెక్కల్లో వాస్తవాలను దాస్తోందని ఆయన దుయ్యబట్టారు.   సోమవారం నుంచి ప్రభుత్వం ప్రతి రోజూ కరోనాపై ఓ బులిటెన్‌ను విడుదల చేస్తోంది కానీ, లెక్కల్లో మాత్రం ఎక్కడో వ్యత్యాసం కనిపిస్తోందని వర్గీయా అనుమానం వ్యక్తం చేశారు. 

‘‘కోవిడ్ - 19 ను ఎలా ఎదుర్కొంటోంది? అన్న ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. ఇప్పటికైనా సరే... పై సమాధానాలకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు, స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా’’ అని వర్గీయ లేఖలో పేర్కొన్నారు.

కోట్ల మంది ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఇంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న సంకేతాలను కూడా ప్రభుత్వం పంపడం లేదని ఆయన మండిపడ్డారు. ఎలాంటి ఇబ్బందులనైనా ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్న భరోసాను ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత మమత సర్కార్‌పై ఉందని వర్గీయ హితవు చెప్పారు.