మహారాష్ట్రలో పరిస్థితి విషమం.. హర్షవర్ధన్ ఆందోళన 

మహారాష్ట్రలో కోవిడ్-19 పరిస్థితి విషమంగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 36 జిల్లాలో 34 జిల్లాలు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. 

మహారాష్ట్రలో కోవిడ్-19 విషమ పరిస్థితిపై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. కరోనా మరింత విస్తరించకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎంతో సమీక్షిస్తామని చెప్పారు. 

 'మంబై, పుణె, థానె, నాగపూర్, నాసిక్, షోలాపూర్, ఔరంగాబాద్ సహా 34 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది' అని హర్షవర్దన్ తెలిపారు. మహారాష్ట్రలోని ఏ ఒక్క జిల్లా నుంచి కూడా కొత్తగా కేసులు లేకుండా చూడటమే కేంద్రం లక్ష్యమని, ఇందుకోసం రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఎలాంటి సాయం చేసేందుకైనా కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. 

తనకు తెలిసినంత వరకూ మహారాష్ట్రలో ప్రస్తుతం 1,026 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని, కేంద్రం  బృందం, వైద్యులు అందుబాటులో ఉండి, అవసరమైన మేరకు మహారాష్ట్రకు సహకారం అందిస్తారని కేంద్ర మంత్రి తెలిపారు.

కాగా, కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం ప్రకారం, మహారాష్ట్రలో ప్రస్తుతం 15,525 కోరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 2,819 మందికి స్వస్థత చేకూరి డిశ్చార్జి అయ్యారు. 617 మంది మృత్యువాత పడ్డారు.