తెలంగాణాలో 29 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు 

తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గత రాత్రి ప్రకటించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఏడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పటి వరకు రాష్ట్రం అంతటా రాత్రి 7 గంటల నుండి  కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం 6 గం టల వరకే పనులు ముగించుకొని 6.45 వరకే ఇళ్లలోకి చేరుకోవాలని చెబుతూ లేకుంటే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. 

కరోనాపై మనం విజయం సాధించడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం లాక్‌డౌన్‌, భౌతికదూరాన్ని పాటించడమే అని పేర్కొన్నారు. కరోనా వచ్చిన తొలిరోజుల్లో దేశానికి ఇటువంటి విపత్తు వస్తే ఎదుర్కొనే నైపుణ్యం లేదని గుర్తు చేస్తూ, కానీ ఇప్పుడు అద్బుతమైన దశకు చేరుకున్నామని పేర్కొన్నారు. 10 లక్షల కిట్లను ఆర్డర్‌ చేశామని, ఇప్పటికిప్పుడు 5.60 లక్షలు కిట్లు మన దగ్గర ఉన్నాయని,  ఇంకొకరికి సాయంచేసే పరిస్థితిలో ఉన్నామని వివరించారు. 

రాష్ట్రంలో 1096 మందికి కరోనా పాజిటివ్‌ కన్ఫర్మ్‌ అయింది. ట్రీట్‌మెంట్‌ పూర్తయి 628 మంది డిశ్చార్జి అయ్యారు.  మంగళవారం  43 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. మన దగ్గర 439 మంది ట్రీట్‌మెంట్లో ఉన్నారని కేసీఆర్ తెలిపారు. 

కరోనాపై రాష్ట్రం ముందునుంచి చాలా కఠినంగా ఒక పకడ్బందీ వ్యూహంతో చర్యలు తీసుకొన్నామని చెబుతూ  దేశంలో మొదటి కంటైన్మెంట్‌ జోన్‌ కరీంనగర్‌ అని గుర్తు చేశారు.  ఈ రోజు మరణాల రేటు చూస్తే దేశంలో 3.34% ఉంటే, మన దగ్గర 2.64% ఉన్నది. యాక్టివ్‌ కేసుల్లోనూ దేశ యావరేజ్‌ 69.21 శాతం ఉంటే మన దగ్గర 42.7% ఉన్నది. రికవరీ రేటులోనూ దేశ సగటు (27.40%)కంటే మనం (57.3%) మెరుగ్గా ఉన్నామని కేసీఆర్ వివరించారు. 

కేంద్ర ప్రభుత్వం జోన్ల వారిగా పలు సడలింపులు ఇచ్చిందని చెబుతూ వాటినన్నింటిని తెలంగాణాలో కూడా అమలు పరుస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం జాబితాలో ఉన్నవాటిలో 5, 6 జిల్లాలు ఈ రోజుకే గ్రీన్‌ జోన్‌లోకి వెళ్తున్నాయి. మంత్రి ఈటల కేంద్ర ఆరోగ్యశాఖమంత్రికి లేఖ రాసి గ్రీన్‌ జోన్‌లోకి మార్పించాల్సి ఉంటుందని చెప్పారు. 

వచ్చే 11 రోజుల్లో ఇప్పుడు ఆరెంజ్‌ జోన్లో ఉన్న 18 జిల్లాలు కూడా గ్రీన్‌జోన్‌లోకి వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కంటైన్మెంట్‌ ఏరియాలు 35 ఉన్నాయని పేర్కొంటూ హైదరాబాద్‌లో 19, ఇతర రెడ్‌జోన్‌ జిల్లాల్లో 16 ఉన్నాయని తెలిపారు. ఈ రోజుతో 23 కంటైన్మెంట్‌ల సమయం పూర్తవుతుందని, వీటిని కూడా డినోటిఫై చేస్తే ఇక  12 కంటైన్మెంట్‌ జోన్లు మాత్రమే ఉంటాయని చెప్పుకొచ్చారు. 

రెడ్‌జోన్‌ జిల్లాలు:సూర్యాపేట, వరంగల్‌ అర్బ న్‌, వికారాబాద్‌,రంగారెడ్డి, మేడ్చల్‌,హైదరాబాద్‌  

గ్రీన్‌ జోన్‌ జిల్లాలు: యాదాద్రి భువనగిరి, వనపర్తి, వరంగల్‌ రూరల్‌, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్‌, నాగర్‌ కర్నూలు, పెద్దపల్లి

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు: సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, నిజామబాద్‌, కామారెడ్డి, నల్గొండ, ఖమ్మం, జనగామ, నారాయణపేట్‌, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, గద్వాల