వ్యవసాయాన్ని పడకేయిస్తున్న చంద్రబాబు

 గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో గ్రామీణ ప్రజల ఆగ్రహానికి గురై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2004లో అధికారం కోల్పోయి, పదేళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉండవలసి వచ్చింది. ఆ అనుభవంతో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగేళ్ళుగా వ్యవసాయ రంగమే తనకు ప్రధానం అంటూ విశేషంగా ప్రచారం చేసుకొంటున్నారు. పైగా వ్యవసాయ రంగంలో రెండంకెల వృద్ది రేట్ – దేశంలో మరే రాష్త్రం కుడా చేరుకోలేనంతగా సాధించిన్నట్లు కుడా చెప్పుకొంటున్నారు.

రెండు కోట్ల ఎకరాలకు అదనంగా సాగు సదుపాయం కల్పించడంతో పాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నామని కుడా హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ప్రతి ఏటా లక్షలాది ఎకరాలు బీడు భోములుగా మిగిలి పోతున్నాయి. సాధారణ సాగుకు కుడా నోచుకోవడం లేదు. అయితే వృద్ది రేట్ ఘనంగా సాధిస్తున్నట్లు ప్రచారం చేసుకొంటున్నారు.

అన్ని ఖరీఫ్‌ సీజన్లలోనూ సాగుకు యోగ్యమైన లక్షల హెక్టార్లు భూమి సేద్యం జరగక పాడయిపోతోంది  వ్యవసాయ అధికారులే అంగీకరిస్తున్నారు. ప్రస్తుత సీజన్‌తో కూడా కలుపుకొని మొత్తం ఐదు ఖరీఫ్‌లల్లో అసలు విత్తనమే పడక బీడుపడ్డ విస్తీర్ణం సాధారణ సాగులో ఆరు శాతం నుంచి పదిహేను శాతం వరకు ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా లక్షల హెక్టార్లలో వరుసగా పంటలు సాగు చేయనందున ఏడాదికేడాది సాధారణ సాగు విస్తీర్ణం తగ్గుతోంది.

ఈ ధోరణి సేద్య రంగంలో తిరోగమనంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఆయువు పట్టయిన ఖరీఫ్‌ పంటలే ప్రతి సంవత్సరం లక్షలాది ఎకరాలలో పడకుండా వదిలి వేస్తూ ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ విషయమై  ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆసక్తి కనబరుస్తున్నట్లు కనిపించడం లేదు. ఐదేళ్లుగా ప్రతి సీజనులోనూ లక్షల హెక్టార్లు సేద్యం లేక ఖాళీ పడటం సాగు రంగ ఉనికికి ప్రమాద ఘంటికలని హెచ్చరిస్తున్నారు. 

టిడిపి అధికారంలోకి వచ్చిన 2014లో మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్‌కలాం చేతులమీదుగా ప్రాధమికరంగ మిషన్‌ను ఆవిష్కరింపజేసి ఐదేళ్లకు సరిపడ వ్యవసాయ వ్యూహపత్రాన్ని ప్రకటించారు. మిషన్‌ అప్రోచ్‌ అని గ్రోత్‌ ఇంజన్‌లని డబుల్‌ డిజిట్‌ అని సమ్మిళితవృద్ధి అని గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ అని ఏవేవో పేర్లు ఉటంకిస్తూ వచ్చింది. వ్యవసాయం వెనకపట్టు పట్టేసరికి తన వైఫల్యాన్ని విపత్తులపై నెట్టేసింది.

వరుసగా కరువులొచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ ముందస్తుగా ప్రణాళికాబద్దంగా నివారణా చర్యలు చేపట్టి ఉంటే అన్నన్ని లక్షల హెక్టార్లను ఖాళీగా పెట్టవలసిన అగత్యం ఉండదనేది శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించడం ద్వారా రైతులు పొలాలను బీడుపెట్టకుండా ఏదోఒక పంటను వారితో పండించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ ఆ దిశలో ఎటువంటి కదలిక కనిపించడం లేదు.

ఆ విధంగా చేసి ఉంటె పశుగ్రాసానికైనా ఇబ్బందులు తప్పుతాయి. రైతులకు కొంతైనా ఆర్థికంగా వెసులుబాటు దొరుకుతుంది. ఆ దిశగా సర్కారు ఆలోచించకపోవడం వల్లనే పచ్చగా కనిపించాల్సిన భూములు నెర్రెలిచ్చుతున్నాయి. వ్యవసాయపరంగా సాధారణ పంటల ప్రగతిని మూలాన పడవేసి, ప్రామాణికమైన గణాంకాలు లేని చేపలు, రొయ్యలు వంటి వ్యవసాయ సంబంధ రంగాలలో ఎన్నో రెట్లు అభివృద్ధి చెప్పిన్నట్లు కాకి లెక్కలు చెప్పి వృద్ది రేటును పలు రెట్లు పెంచుతూ చూపుతున్నారని అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి.

2014 ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణంలో తొమ్మిది శాతం బీడు పడగా 2015లో 15 శాతం, 2016లో ఆరు శాతం, 2017లో 11 శాతం, ఈ ఏడాది ఖరీఫ్‌లో 12 శాతం పంటలు సాగు కాలేదు. ఆహారధాన్యాల విషయానికొస్తే 2014లో పది శాతం, 2015లో 11 శాతం, 2017లో మూడు శాతం, ప్రస్తుత సీజనులో తొమ్మిది శాతం విస్తీర్ణంలో సాగు కాలేదు. ఒక్క 2016లో మాత్రం బొటాబొటిగా ఆహారపంటలు సాగయ్యాయి.

 పెద్ద ఎత్తున పంటలు సాగు కాకపోవడంతో సాధారణ సాగుపై ప్రతికూల ప్రభావం పడుతోంది. సాగు లక్ష్యాలకు కోతలు పడుతున్నాయి. సాధారణసాగును ఐదేళ్ల సరాసరి ప్రాతిపదికన గణిస్తారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఏడాది 2014లో ఖరీఫ్‌ సాధారణ సాగు 41.72 లక్షల హెక్టార్లు కాగా 2018కి వచ్చేసరికి 39.53 లక్షల హెక్టార్లకు తగ్గింది. అలాగే ఆహారధాన్యాలు 21.20 లక్షల హెక్టార్ల నుంచి 20.90 లక్షల హెక్టార్లకు దిగజారింది.