నరసరావుపేటలో పూర్తిగా లాక్‌డౌన్‌  

ఆంధ్ర ప్రదేశ్ లోనే మేజర్‌ హాట్‌స్పాట్‌గా గుంటూరు జిల్లా నరసరావుపేటను ప్రకటించారు. మంగళవారం నుంచి గురువారం దాకా ఈ పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. 

నరసరావుపేటలో బాధితుల సంఖ్య 148కి చేరగా, సోమవారమే కొత్తగా 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో వరవకట్టలోనే 10 కేసులున్నాయి. ఈ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఏఎ్‌సఐకి కూడా వైరస్‌ సోకింది. 

ఈ నేపథ్యంలో నరసరావుపేటను మేజర్‌ హాట్‌స్పాట్‌గా గుర్తించినట్టు సబ్‌ కలెక్టర్‌ దినేశ్‌ కుమార్‌ వెల్లడించారు. రానున్న మూడు రోజులు పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు. 

ఈ  నెల 15 కల్లా జీరో పాజిటివ్‌ కేసులు నమోదే లక్ష్యంగా ‘మిషన్‌ మే 15’ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నరసరావుపేటలో సామాజిక వ్యాప్తిలో వైరస్‌ ఉందా? లేదా? అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, దీనికోసం ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.