ఉగ్రవాదం, నకిలీ వార్తల వైరస్ వ్యాప్తి 

మొత్తం ప్రపంచం ప్రాణాంతక కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో అవిశ్రాంతంగా పోరాడుతూ ఉంటె కొద్దీ మంత్రి మాత్రం ఉగ్రవాదం, నకిలీ వార్తల వైరస్ ను వ్యాప్తి చేయడంలో తీరిక లేకుండా ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. అలీన దేశాల అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆయన ఏ దేశం పేరు చెప్పక పోయినప్పటికీ కాశ్మీర్  లో మూడు రోజులలో జరిగిన రెండు ఉగ్రవాద దాడులలో 8 మంది భారత్ సైనికులను హతమార్చడం గురించే అని అందరికి తెలిసిందే. 

పైగా, దేశాలను, ప్రజలను విడదీయడం కోసం ఇటువంటి వారు సృష్టించిన వీడియోలను విడుదల చేస్తున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత అంతర్జాతీయ వ్యవస్థకు గల పరిమితులను కరోనా సంక్షోభం వెల్లడి చేసినదని గుర్తు చేస్తూ నిజాయతి, సమానత, మానవతా ప్రాతిపదికగా గల నూతన ప్రపంచీకరణ విధానం అవసరమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపిచ్చారు. 

అంతర్జాతీయ సంస్థలలో కొద్దిపాటి అగ్రరాజ్యాల పెత్తనం కొనసాగుతూ ఉండడాన్ని  పరోక్షంగా ప్రస్తావిస్తూ అంతర్జాతీయ సంస్థలు నేటి వాస్తవికతకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండాలని స్పష్టం చేశారు. కేవలం ఆర్ధిక ప్రగతిపైననే కాకూండా మానవ సంక్షేమం పెంపుదల పట్ల దృష్టి సారించాలని సూచించారు. సుదీర్ఘకాలంగా భారత్ అటువంటి విలువలను ప్రోత్సహిస్తున్నదని ప్రధాని గుర్తు చేశారు. 

ఈ మహోన్నత పాత్రను వహించడం కోసం అలీన ఉద్యమం తన సమ్మిళిత విధానాన్ని కొనసాగించాలని ప్రధాని స్పష్టం చేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజాస్వామ్యం, క్రమశిక్షణ, నిర్ణయాత్మకత కలసి ఏ విధంగా విలక్షణమైన ప్రజా ఉద్యమంగా రూపుదాల్చగలవో చూపమని పేర్కొన్నారు. "మేము మా ప్రజల సంక్షేమం గురించి పట్టించుకొంటూనే ఇతరులకు కూడా సహాయం అందించాము"  అని గుర్తు చేసారు. 

కోవిద్ 19ని కట్టడి చేయడం కోసం మేము మా పొరుగు దేశాలతో సమన్వ్యయం  సాగిస్తూనే భారత దేశపు వైద్యపరమైన అనుభవాలను అనేకమందితో ఆన్ లైన్ లో పంచుకొంటున్నామని ప్రధాని మోదీ వివరించారు. చాలా దశాబ్దాలలో ఎరుగని పెను సవాళ్ళను నేడు మానవాళి ఎదుర్కొంటున్నదని పేర్కొంటూ ఇటువంటి సమయంలో అలీన ఉద్యమం సంఘీభావం వ్యక్తం చేయాలని సూచించారు. 

అలీన ఉద్యమం తరచూ ప్రపంచపు నైతిక ఉద్యమంగా ఉంటుందని చెబుతూ ఈ విశిష్టతను కొనసాగించడం కోసం సమ్మిళతంగా ఉండాలని తెలిపారు. కోవిద్ 19 ఉపద్రవం సందర్భంగా స్వదేశంలోని అవసరాలను తీరుస్తూనే 59 అలీన దేశాలతో 120 దేశాలకు భారత్ మందులను పంపినదని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.