లాక్‌డౌన్ సడలింపుతో రోడ్లపై రద్దీ  

సోమవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0 అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం కొన్ని మినహాయింపులనిచ్చింది. దీంతో పాటు వివిధ రాష్ర్టాలు కూడా ఆంక్షల్లో పలు సడలింపులనిచ్చాయి. తమిళనాడు, కేరళ, ఒడిశా, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, అసోం తదితర రాష్ట్రాలు ఆంక్షలు సడలించాయి. 

దానితో ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల పరిధిలోని క్షౌరశాలలు, ఎలక్ట్రికల్‌ దుకాణాలు, స్టేషనరీ, ఆటోమొబైల్‌ షాపులు సోమవారం తెరుచుకున్నాయి. దీంతో వినియోగదారులు పెద్దఎత్తున కొనుగోళ్లు జరిపారు. రెడ్‌ జోన్‌ బయట ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులు తమ విధులకు హాజరయ్యారు. ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల పరిధిలో తిరిగేందుకు ప్రైవేటు వాహనాలకు అనుమతులనివ్వడంతో పెద్దమొత్తంలో వాహనాలు రోడ్లపైకి వచ్చాయి.  

డలింపులతో నిత్యావసర దుకాణాలు తెరుచుకోవడంతో పాటు పలు వాణిజ్య కార్యకలాపాలు ప్రాంభమైనాయి. దీంతో పలు రాష్ట్రాల్లో రోడ్లపై రద్దీ వాతావరణం కనిపించింది. ప్రైవేటు కార్యాలయాలు కూడా తెరుచుకోవడంతో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. మహారాష్ట్రలోని నాసిక్ వంటి ప్రాంతాల్లో పలు ఐటి కంపెనీలు తెరుచుకున్నాయి. అయితే ఉద్యోగులు భౌతిక దూరం పాటిస్తూ కార్యాలయాల్లోకి వెళ్లే ముందు వారికి శరీర ఉష్ణోగ్రతలు పరీక్షిస్తున్నారు. 

దేశ రాజధాని ఢిల్లీలో భవన నిర్మాణ కార్యకలాపాలు మొదలైనాయి. ముఖ్యంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రజలు రోజువారీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కేరళలో నిత్యావసర దుకాణాలే కాకుండా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద లైసెన్స్ పొందిన అన్ని దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించడంతో మల్టీబ్రాండ్ వంటి పెద్ద దుకాణాలు తప్ప అన్ని దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి.

చత్తీస్‌గఢ్‌లో సోమవారంనుంచి ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమైనాయి. కాగా పశ్చిబెంగాల్‌లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో 20మంది ప్రయాణికులతో ప్రైవేటు బస్సులు నడవడానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ అది తమకు లాభసాటి కాదన్న కారణంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు బస్సులు నడపడానికి నిరాకరిస్తున్నారు. 

అసోంలో లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించడంతో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 6 గంటవరకు లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నాలుగు జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉండగా, మిగిలిన జిల్లాలో గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి.