7 నుంచి విదేశాల్లో చిక్కున్న భార‌తీయుల త‌ర‌లింపు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ వ‌ల్ల ల‌క్ష‌లాది మంది భార‌తీయులు విదేశాల్లో చిక్కుకున్నారు.  వారంద‌ర్నీ మే 7వ తేదీ నుంచి భారత్ కు ద‌శ‌ల‌వారీగా తీసుకురానున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. దీని కోసం భారీ కసరత్తు చేస్తున్నారు. 

విమానాలు, భారీ నౌక‌ల ద్వారా త‌ర‌లింపు ఉంటుంద‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్చి 22వ తేదీ నుంచి అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌ను ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. నాన్ షెడ్యూల్డ్ క‌మ‌ర్షియ‌ల్ ఫ్ల‌యిట్స్‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఆ విమాన సేవ‌లు పేమెంట్ ఆధారంగా ఉంటుంద‌ని కేంద్రం తెలిపింది. 

విమానం ఎక్కేముందు ప్ర‌తి ప్ర‌యాణికుడికి ప‌రీక్ష‌లు చేప‌డుతామ‌ని, కేవ‌లం ల‌క్ష‌ణాలు లేని వారిని మాత్ర‌మే భార‌త్‌కు తీసుకువ‌స్తామని తెలిపారు. ఒక‌సారి భార‌త్‌కు చేరుకున్న త‌ర్వాత‌.. వారంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 14 రోజుల క్వారెంటైన్ త‌ర్వాత కోవిడ్‌19 ప‌రీక్ష చేయించుకోవాలి.  

అయితే ఎంత మంది భార‌తీయుల‌ను వెన‌క్కి ర‌ప్పించే ప్ర‌ణాళిక వేశార‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలియ‌దు. తొలుత గ‌ల్ఫ్ దేశాల నుంచి ఆ త‌ర్వాత ఐరోపా దేశాల్లో చిక్కుకున్న‌వారిని తీసుకురానున్నారు. గ‌ల్ఫ్ దేశాల్లో సుమారు 80 ల‌క్ష‌ల మంది భార‌తీయులు ఉన్నారు.  

మాల్దీవులు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  దేశాల్లో చిక్కుకున్న భారతపౌరులను స్వదేశానికి తరలించడానికి భారత నావికాదళం మూడు నౌకలను పంపించినట్లు కేంద్ర రక్షణ శాఖ ప్రతినిధి  వెల్లడించారు. ముంబై సముద్ర తీరంలో మోహరించిన ఐఎన్ఎస్ జలష్వా, ఐఎన్ఎస్ మగర్ నౌకలను మాల్దీవులకు పంపించారు. 

ఐఎన్ఎస్ షార్దుల్ అనే మరో నౌకను దుబాయ్ దేశానికి మళ్లించాచారు.  వీరందరిని కేరళ రాష్ట్రంలోని కొచ్చి ఓడరేవుకు తీసుకువస్తామని రక్షణశాఖ పేర్కొంది.