వలస కార్మికులపై తక్షణం చర్యలు 

వలస కూలీలను, పర్యాటకులను తరలించడంలో ఏదైనా ఆలస్యం అయితే సమస్యలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు.  వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు తమ తమ స్వస్థలాలకు చేరేలా తక్షణం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీసం సాహ్నీకి వ్రాసిన లేఖలో లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో లక్షలాది మంది చిక్కుకుపోయారని, వలస కార్మికుల సమస్య మరింత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. దాదాపు మోత్తం ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయని చుపెపుకొచ్చారు.

పనులు లేక, తిండి లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారని ఆయన సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం వలస కూలీలను పంపేందుకు మార్గదర్శకాలను జారీ చేసిందని కన్నా గుర్తుచేశారు. 

అయితే ఈ విషయంలో రాష్ట్రానికి ఇద్దరు నోడల్ అధికారుల రెండు కాంటాక్ట్ నంబర్లు సరిపోవని కన్నా స్పష్టం చేశారు. రాష్ట్రంలో వేచి ఉంటున్న వేలాది మంది.. సాయం కోసం కాల్స్ చేస్తారని, రాష్ట్ర స్థాయిలో కనీసం పది లేదా పన్నెండు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలని సీఎస్‌కు కన్నా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలని కోరారు.