`మార్పు కోసం తెలంగాణ’ నినాదంతో అధికారం

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో `మార్పు కోసం తెలంగాణ’ నినాదంతో 60కి పైగా సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు డా. కె లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేసారు. ఇందుకనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ నెల 10న కరీంనగర్‌లో ‘సమరభేరీ’ మోగించబోతున్న పార్టీ అద్యక్షుడు అమిత్ షా అదే రోజు అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్‌చార్జ్‌లు, బూత్ కమిటీ, శక్తి కేంద్రాల నేతలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారని చెబుతూ  ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి తెలంగాణలో బీజేపీని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, కాంగ్రెస్ పాలన, తెలంగాణ ఏర్పడిన తరువాత టీఆర్‌ఎస్ పాలనను ప్రజలు చూశారని, ఆయా ఆ పార్టీల అవినీతి, కుటుంబ రాజకీయాలను ప్రజలు గమనించారని చెబుతూ ఇప్పుడు వారు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.  ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమముందని, ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాని చెబుతూ అన్ని సీట్లలో పోటీ చేస్తామని తెలిపారు.

అభ్యర్థుల ఎంపికపై పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నామని, ఎంపికకు సంబంధించిన జాబితాను పార్టీ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తామని, అక్కడ నుంచి ఆమోదం లభించిన తరువాత ప్రకటిస్తామని వివరిస్తూ ఇదంత ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.  ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకొంటూ పార్టీలో ఉన్నవారితో పాటు కొత్తగా చేరిన వారికి కూడా టికెట్లు ఇచ్చే ఆలోచన ఉందని లక్ష్మణ్ చెప్పారు.

ఎన్నికల్లో ప్రజల నుంచి ఆదరణ పొందడానికి ‘ప్రజా మేనిఫెస్టో’ రూపొందిస్తున్నామని తెలుపుతూ,  ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీ ప్రజల నుంచి అభిప్రాయాలను  సేకరిస్తోందని, ప్రజా అవసరాలకు అనుగుణంగా మెనిఫెస్టోలో హామీలుంటాయని తెలిపారు.

దేశంతో పాటు రాష్ట్రంలోనూ ప్రధానంగా సొంత ఇంటి సమస్య ప్రజలను వేధిస్తోందని చెబుతూ, ఈ సమస్యను గుర్తించిన కేంద్రం ప్రధానమంతి ‘ఆవాస్ యోజన’ కింద 2022 నాటికి ప్రతి ఒక్కరికి సొంతిల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని గుర్తు చేసారు. ఈ పథకంలో భాగంగా తెలంగాణకు కూడా నిధులు మంజూరు చేసినా కేసీఆర్ సర్కారు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి కేంద్ర పథకం అమలు చేయలేదని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. దీన్ని గుర్తించిన తాము ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేరే వరకూ వారికి ఇంటి కిరాయి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సహా పలువురు కేంద్రమంత్రులు ప్రచారం చేస్తారని చేలిపారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో సమానంగా రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందని చెబుతూ 1998లోనే ఒంటరిగా పోటీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 శాతం ఓట్లను సాధింఛి, 4 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నామని గుర్తు చేసారు.  ఇప్పుడు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశామని, కేసీఆర్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వివిధ రూపాల్లో ఉద్యమాలు నిర్మించామని పేర్కొన్నారు.

గెలుస్తామని మాటల్లోనే కాదు చేతల్లో చూపిస్తామని లక్ష్మణ్ భరోసా వ్యక్తం చేసారు. కాగా, కాంగ్రెస్‌ను ఓడించాలన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌తో తాము రహస్య ఒప్పందం కుదుర్చుకుందన్న ప్రచారంలో వాస్తవం లేదని లక్ష్మణ్ స్పష్టం చేసారు. తమపై కావాలనే కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెండు తమకు రాజకీయ శత్రువులే అని స్పష్టం చేస్తూ ఈ రెండు పార్టీలు, ఎంఐఎం ఒక్కటే అని పేర్కొన్నారు. వారికి ఇప్పుడు టీడీపీ కూడా తోడవుతుందని చెబుతూ ఈ పార్టీలను ఓడించడమే బిజెపి ప్రధాన లక్ష్యం అని ప్రకటించారు.