యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ వాయిదా

అఖిల భార‌త స‌ర్వీసుల్లో మ‌న దేశ యువ‌త‌లో చాలా మందికి ఉండే క‌ల. ఆ క‌ల‌ను సాకారం చేసుకునేందుకు తొలి మెట్టు యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించే సివిల్స్ ప్రిలిమిన‌రీ పరీక్ష. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఈ ప‌రీక్ష మే 31న జ‌ర‌గాల్సి ఉంది. అయితే క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది యూపీఎస్సీ.

క‌మిష‌న్ చైర్మ‌న్ అర్వింద్ స‌క్సేనా నేతృత్వంలో సోమ‌వారం జ‌రిగిన స‌మావేశంలో పరీక్షల వాయిదాపై నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు యూపీఎస్సీ సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలిపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉండ‌డంతో దేశ వ్యాప్తంగా దాదాపు 10 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు హాజ‌ర‌య్యే సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వ‌హించ‌డం మంచిది కాదని భావించారు. 

పైగా అనేక ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలుగా  అనుకున్న కాలేజీల‌ను ప్ర‌భుత్వం క్వారంటైన్ సెంట‌ర్లుగా వినియోగిస్తోంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం వాయిదాపై నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ ఇప్పుడే కొత్త తేదీని  ప్ర‌క‌టించ‌లేమ‌ని స్పష్టం చేసారు. 

అయితే మే 20 నాటికి దేశంలో ప‌రిస్థితుల‌పై మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించి.. ఆ రోజున కొత్త తేదీని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందని పేర్కొ‌న్నారు. ఇలా ఉండగా బహుశా ఆగష్టు లో ఈ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.