ఏపీలో మద్యం షాపుల ముందు భారీ క్యూలు 

ఆంధ్రప్రదేశ్ లో ఎట్టకేలకు మద్యం దుకాణాలు సోమవారం నుండి తెరుచు కోవడంతో ఆరు వారాలుగా మద్యం లేక ఆరాట పడుతున్న మద్యం ప్రియులు వాటి ముందు తెల్లవారుజాము నుండే క్యూలు కట్టడం కనిపిస్తున్నది.   ఉదయం 11  గంటలకు ప్రారంభమైన ఈ షాప్ లు రాత్రి 7 గంటల వరకు ప్రభుత్వం అనుమతించింది. 

పలు చోట్ల కిలోమీటర్ల మేరకు ఈ క్యూలు ఉన్నాయి. భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా పలుచోట్ల అందుకు సాధ్యపడటం లేదు. గంటల కొద్దీ క్యూలలో ఉండవలసి రావడంతో పలుచోట్ల అసహనం కూడా వ్యక్తం అవుతుంది. మాస్కులతో పాటు భౌతిక దూరం పాటించాలని పోలీసులు ఎంతగా చెబుతున్నా పలుచోట్ల వారు వినిపించుకోవట్లేదు. కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాల ముందు బారులు తీరిన వందలాంది మందిని పోలీసులు చెదరగొడుతున్నారు.

ఐదేళ్లలో సంపూర్ణ మధ్య నిషేధం దశలవారీగా అమలు పరుస్తామని అధికారయంలోకి వచ్చిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లాక్ డౌన్ లో మద్యం అమ్మకాలు నిలిపివేసే అవకాశాలు ఉన్నా ఆగలేక కేంద్రం కొంచెం సడలింపు ఇవ్వగానే గ్రీన్ జోన్, ఎల్లో జోన్ లలో తెరవడానికి అనుమతి ఇచ్చింది. పైగా ప్రభుత్వ ఆదాయమే ముఖ్యం అన్న విధంగా 25 శాతం మేరకు మద్యం ధరలు పెంచి మరీ షాపులు తెరిచే అనుమతి ఇచ్చింది. 

ధరలు పెంచడం ద్వారా ప్రజలను మద్యం సేవించకుండా నిరుత్సాహ పరుస్తున్నట్లు ప్రభుత్వం పొంతనలేని వాదన చేస్తున్నది. అయితే  ధర పెంచినా మందుబాబులు వెనుకడుగు వేయడంలేదు. కిక్ కోసం బారులుతీరారు. 

గుంటూరు జిల్లా నందివెలుగులో అయితే ఓ వైన్ షాపు వద్ద ఏకంగా 4 కి.మీ. మేర క్యూ పెరిగింది. ఎండ ఠారెత్తిస్తున్నా మద్యం కోసం పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల అయితే చెప్పులు లైన్‌లో ఉంచారు.నెల్లూరులో మద్యం కోసం వందల సంఖ్యలో మందు బాబులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. అయితే సామాజిక దూరం పాటించకుండా... కనీసం మాస్కులు ధరించకుండా మందుబాబులు క్యూలలో వేచి ఉన్నారు.

చిత్తూర్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో 160 దుకాణాల్లో అమ్మకాలు చేపట్టారు. కాగా జిల్లాలో ఎక్కడ కూడా సామాజిక భౌతిక దూరం పాటించని పరిస్థితి నెలకొంది. ఉదయం 7 గంటలకే మందుబాబులు అధికసంఖ్యలో మద్యం షాపుల వద్ద బారులు తీరారు. దీంతో మద్యం ప్రియులను నియంత్రించడానికి పోలీసులు రంగంలోకి దిగారు.  

రేణిగుంట మండలం పాపానాయుడుపేట వద్ద సోమవారం మహిళలు ఆందోళనకు దిగారు.  ఇళ్ల మధ్యలో ఉన్న బ్రాందీ షాప్‌లను మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. పోలీసుల జోక్యంతో మూడు మద్యం షాపులను తాత్కాలికంగా మూసివేశారు.  

 కాగా పలు గ్రామాలలో విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఉంటే మద్యం అమ్మకాలు చేస్తారా అంటూ మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. ఇలా చేస్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ షాపుల వద్దనే సాంఘిక దూరం అమలు పరచలేని అధికారులు మద్యం షాపుల వద్ద యెట్లా అమలు పరుస్తారని అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.