ఎంఎస్‌ఎంఈలకు త్వరఫలో రిలీఫ్ ప్యాకేజీ  

సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలకు) కేంద్ర ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించడంపై కసరత్తు తుదిదశకు చేరిందని ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కరోనాను ఎదుర్కొనే నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ వల్ల భారీగా నష్టపోయింది ఈ రంగాలేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కేంద్రం నుంచి భారీ ప్యాకేజీని ఈ రంగాల్లోనివారు ఆశిస్తున్నారు. 

రిలీఫ్ ప్యాకేజీని కోరుతూ ఎంఎస్‌ఎంఈ శాఖ ఇప్పటికే ఓ జాబితాను ఆర్థికశాఖకు పంపింది. దీంతోపాటు పలు రంగాలకు ప్రకటించాల్సిన ఉద్దీపనలపై చర్చించేందుకు ఆర్థిఖశాఖ మంత్రితోపాటు ఇతర కీలక శాఖలతో శనివారం ప్రధాని సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీకి గడ్కరీ కూడా హాజరయ్యారు.

రిలీఫ్ ప్యాకేజీ కోసం తమ శాఖ నుంచి ఆర్థికశాఖతోపాటు ప్రధానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలో ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామని గడ్కరీ తెలిపారు. సాధ్యమైనంత ఎక్కువే రిలీఫ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు.

సీనియర్ మంత్రులతో ప్రధాని నిర్వహించిన భేటీలో సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమలకు ద్రవ్య లభ్యతను పెంచేందుకు సానుకూలత వ్యక్తమైనట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఎంఎస్‌ఎంఈలు, రైతులకు ద్రవ్య లభ్యతను బలోపేతం చేసే వ్యూహాలపై ఆర్థికమ్రంతితోపాటు ఇతర మంత్రులతో ప్రధాని చర్చించినట్టు సమావేశానంతరం ప్రధాని కార్యాలయం తెలిపింది. 

ఎంఎస్‌ఎంఈలకు పరపతి హామీ పథకం పరిమితిని పెంచేందుకు ఆ శాఖ నుంచి సానుకూలత వ్యక్తమైంది. ఈ తరహా పరిశ్రమలకు పన్ను మినహాయింపుల్ని కూడా ఈ శాఖ కోరింది. ఎంఎస్‌ఎంఈలకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వశాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు వడ్డీతోసహా క్లియర్ చేయాలని సూచించింది