ప్రపంచంలో మెరుగుగా భారత్ వైఖరి 

 కోవిడ్-19పై పోరులో భారత దేశం అనుసరిస్తున్న వైఖరి మెరుగ్గా ఉందని భారత వైద్య, పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ వంటి దేశాలతో మన దేశాన్ని పోల్చుతూ గణాంకాలను విడుదల చేసింది. ఇతర దేశాల కన్నా మన దేశం ఈ పోరాటంలో మెరుగైన స్థితిలో ఉందని పేర్కొంది. 

భారత దేశంలో 10 లక్షల మందికి పైగా కోవిడ్-19 నిర్థరణ పరీక్షలు జరిగినట్లు తెలిపింది. 39,980 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయినట్లు తెలిపింది.  స్పెయిన్‌లో 10 లక్షల మందికి పైగా కోవిడ్-19 నిర్థరణ పరీక్షలు జరిగిన తర్వాత 2,00,194 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయినట్లు గుర్తు చేసింది. 

అదే విధంగా  10 లక్షల మందికి పైగా కోవిడ్-19 నిర్థరణ పరీక్షలు జరిగిన తర్వాత అమెరికాలో  1,64,620 మందికి, ఇటలీలో 1,52,271 మందికి, టర్కీలో 1,17,589 మందికి, జర్మనీలో 73,522 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయినట్లు వివరించింది. 

ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెరికా, ఐరోపా దేశాలలో కన్నా అత్యధిక జనసాంద్రత మన దేశంలో ఉంది. ఎక్కువ మంది ప్రజలు ఒకే చోట నివసించే దేశం అయినప్పటికీ, మన దేశం కోవిడ్-19ను కట్టడి చేయడంలో విజయం సాధిస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి వల్ల 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు 310 ప్రభుత్వ ల్యాబొరేటరీలు, 111 ప్రైవేటు ల్యాబొరేటరీలలో 10,46,450 శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.