కరోనా కేసుల పెరుగుదల త్వరలోనే అదుపు

దేశంలో కరోనా కేసుల పెరుగుదల రేటు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం కేసులు రెండింతలు పెరగే రేటు 10.5 రోజులు ఉండగా ప్రస్తుతం 12 రోజులకు చేరిందని ఆయన చెప్పారు. 

10 వేలకు పైగా మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆసుపత్రుల్లో చేరిన వారికి వైద్యం అందుతోందని, వారు కూడా త్వరలోనే కోలుకుంటారని పేర్కొన్నారు.  

అంతే కాకుండా దేశంలో మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉందని చెబుతూ ప్రస్తుతం దేశంలో 3.2 శాతం ఉందని, ప్రపంచం రేటుతో పోల్చితే ఇది చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు హర్ష వర్ధన్ పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 40 వేల మార్కును దాటాయి. ఇందులో యాక్టివ్ కేసులు 28 వేలు. ఇక కరోనా వల్ల 1,306 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా,  ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసుల పెరుగుదల త్వరలోనే అదుపులోకి వస్తుందని నీతీ ఆయోగ్ సభ్యుడు వీ కే పాల్ భరోసా వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకూ విధించిన లాక్ డౌన్ కారణంగా పరిస్థితి మెరుగుపడిందని, దీన్ని అలాగే కొనసాగించేందుకే మరో రెండు వారాల పాటు ప్రభుత్వం లాక్ డౌన్ కొనసాగించిందని ఆయన తెలిపారు.

లాక్ డౌన్ అసలు లక్ష్యం.. కరోనా గొలుసు కట్టు వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమేనని మరోసారి స్పష్టం చేశారు. అకస్మాత్తుగా లాక్ డౌన్ ఎత్తేస్తే సాధించిన మెరుగుదల అంతా కోల్పోతామని స్పష్టం చేశారు. 

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కంటైన్మెంట్ వ్యూహం ద్వారా పరిస్థితిని అదుపులోకి తేవచ్చని పాల్ తెలిపారు. లాక్ డౌన్ విధించకముందు పరిస్థితితో పోలిస్తే ఇప్పటి స్థితి ఎంతో మెరుగ్గా ఉందని చెప్పారు.