పాక్ లో కరోనా పేరుతో ఉగ్రవాదుల విడుదల 

ఒక వంక ఉగ్రవాదులతో పాటు కరోనా రోగులను కాశ్మీర్లోకి జొప్పించడం కోసం ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ మరో వంక జైళ్లలో కరోనా వ్యాప్తి నియంత్రణ పేరుతో విడుదల చేస్తున్న ఖైదీల చాటున కరడుగట్టిన ఉగ్రవాదులను కూడా వదిలి పెడుతున్నది. 

ఉగ్రవాద కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ అటు భారత్ ఇటు ప్రపంచ దేశాలు ఎన్ని సార్లు కోరినా పాక్ తన పంథాను వీడే ప్రసక్తే లేదన్నట్టు ప్రవర్తిస్తోంది. లాహోర్ జైల్లో 50 మందికి కరోనా సోకినట్టు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఇటీవల తెలిపారు. 

కరోనా వ్యాప్తిని అడ్డుకోవటమా లేక ఖైదీల జైళ్లకే పరిమితం చేయడమా అనేది నిర్ణియంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. అయితే ఈ విధానాన్ని ఇతర దేశాలు ఇప్పటికే అములు చేస్తున్నాయి. జైళ్లో కరోనా వ్యాపించ కుండా ఖైదీలను విడుదల చేస్తున్నాయి. 

ఈ సాకు మాటున పొరుగు దేశంపై దాడికి పాల్పడ్డ హఫీజ్ లాంటి కరుడు గట్టిన ఉగ్రవాదిని విడుదల చేయడమేంటని రక్షణ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ పాక్ ఎటువంటి చడీచప్పుడూ లేకుండా 1800 మంది ఉగ్రవాదులు, సంస్థలను అనుమానితుల జాబితాను తొలగించింది.

ఈ జాబితాలో ఉన్న వారితో ఎటువంటి ఆర్థిక, వ్యాపార సంబంధాలు ఉండకూడదనే నిబంధన ఉన్న సమయంలో ఇలా పక్కదారిగుండా ఉగ్రవాదులకు ప్రయోజనం చేకూర్చే చర్యలకు దిగిందని అమెరికాకు చెందిన ఓ అబ్జర్వర్ సంస్థ తెలిపింది. 

ఇక నిపుణులు అభిప్రాయం ప్రకారం..పాక్ తీసుకున్న చర్యలను త్వరలో సమీక్షి ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్‌కు కొత్త తలనొప్పులు వస్తాయని భావిస్తున్నారు. దీంతో కరోనా పేరిట పాక్ తీసుకుంటున్న ఉగ్రవాద అనుకూల చర్యలను ఎఫ్ఏ‌టీఏఫ్ ఏ రకంగా అడ్డుకుంటుందనే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.