హంద్వారా సైనిక అమ‌రుల‌కు ప్ర‌ధాని మోదీ నివాళి

జ‌మ్మూక‌శ్మీర్‌లోని హంద్వారాలో ఇవాళ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో భార‌త సైన్యం అయిదుగురు సైనికుల‌ను కోల్పోయింది.  ఓ క‌ల్న‌ల్‌, మేజ‌ర్‌తో పాటు మ‌రో ముగ్గురు జ‌వాన్లు కూడా ఉన్నారు. అమ‌ర జ‌వాన్లకు ప్ర‌ధాని మోదీ నివాళ అర్పించారు.  

వారి ధైర్య‌సాహ‌సాలు, త్యాగాల‌ను ఎన్న‌టికీ మ‌ర‌వ‌మ‌న్నారు.  ఎంతో దీక్ష‌తో వారు దేశానికి సేవ చేశార‌ని కొనియాడారు.  దేశ పౌరుల‌ను ర‌క్షించేందుకు వారు నిరంత‌రం శ్ర‌మించార‌ని నివాళులు అర్పించారు.  ఎన్‌కౌంట‌ర్‌లో ప్రాణాలు కోల్పోయిన జ‌వాన్ల కుటుంబాలు, మిత్రుల‌కు ప్ర‌ధాని మోదీ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.  

 హంద్వారా ఘ‌ట‌న తీవ్ర మ‌న‌స్తాపాన్ని క‌లిగించిన‌ట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉగ్ర‌వాదుల‌పై పోరాటం చేసేందుకు జ‌వాన్లు అత్యుత్త‌మ ధైర్యాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని కొనియాడారు. దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించిన‌ట్లు చెప్పారు.  వారి ధైర్య‌సాహ‌సాల‌ను, త్యాగాల‌ను మేం ఎన్న‌టికీ మ‌ర‌వ‌మని పేర్కొ‌న్నారు.  

ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళ్లు అర్పిస్తున్న‌ట్లు తెలిపారు. వీర మ‌ర‌ణం పొందిని సైనిక కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. అసామాన్య ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తున్న అమ‌ర సైనికుల కుటుంబాల‌కు భార‌త్ అండ‌గా ఉంటుంద‌ని భరోసా ఇచ్చారు. 

ఈ సందర్భంగా క‌ల్న‌ల్ అశుతోష్ శ‌ర్మ మ‌హా వీరుడ‌ని, ఎక్క‌డ ఏ ఆప‌రేష‌న్ జ‌రిగినా ఆయన ముందుండే వాడ‌ని భార‌త‌ ఆర్మీ అధికారులు తెలిపారు. గార్డ్స్ రెజిమెంట్‌కు చెందిన ఆయ‌న 21 రాష్ట్రీయ రైఫిల్స్ క‌మాండింగ్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తూ దేశ ర‌క్ష‌ణ కోసం ప్రాణాల‌ర్పించారని పేర్కొన్నారు. 

క‌ల్న‌ల్ అశుతోష్ శ‌ర్మ ఎన్నో ఉగ్ర‌వాద వ్య‌తిరేక ఆప‌రేష‌న్ల‌లో పాల్గొన్నార‌ని, ఆయ‌న నేతృత్వంలో జ‌రిగిన అన్ని ఆప‌రేష‌న్లు విజ‌య‌వంత‌మ‌య్యాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. క‌ల్న‌ల్ అశుతోష్ ధైర్య సాహసాల‌కు గుర్తుగా భార‌త ప్ర‌భుత్వం ఇప్ప‌టికే రెండుసార్లు ఆయ‌న‌ను శౌర్య ప‌త‌కాలతో స‌త్క‌రించింద‌ని తెలిపారు. 

ఒక ఆప‌రేష‌న్ సంద‌ర్భంగా ఓ ‌ఉగ్ర‌వాది ఒంటికి గ్రెనేడ్లు అమ‌ర్చుకుని సైనికుల వైపు ప‌రుగెత్తుకుంటూ వ‌స్తుండ‌గా క‌ల్న‌ల్ అశుతోష్ అతి స‌మీపం నుంచి అత‌డిని కాల్చివేశాడ‌ని, లేదంటే అప్పుడు చాలామంది సైనికులు మ‌ర‌ణించేవార‌ని అధికారులు చెప్పారు. 

కాగా, గ‌త ఐదేండ్ల‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో క‌ల్న‌ల్ స్థాయి అధికారి  చ‌నిపోవ‌డం ఇదే తొలిసార‌ని, 2015 జ‌న‌వ‌రిలో క‌ల్న‌ల్ ఎంఎన్ రాయ్‌, అదే ఏడాది న‌వంబ‌ర్‌లో క‌ల్న‌ల్ సంతోష్ మహ‌దిక్ ఉగ్ర‌వాదుల కాల్పుల్లో చ‌నిపోయార‌ని ఆర్మీ వెల్ల‌డించింది.  ‌