రాజస్థాన్ చరిత్రను వసుంధర మారుస్తారా !

గత 25 ఏళ్ళుగా రాజస్థాన్ లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఒక్కరి తర్వాత మరొకరు గెలుస్తూ వస్తున్నారు. గత ఐదు ఎన్నికలలో ముఖ్యమంత్రిగా ఉన్నవారేవ్వారు తమ పార్టీని ఎన్నికలలో గెలిపించలేక పోయారు. అంటే ప్రజలు ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారం అప్పజెప్పలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఈ  రాష్ట్రంలో  బిజెపి అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ కు అదే పెద్ద అవకాశంగా మారింది.

పైగా ఈ మధ్య జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఉపఎన్నికలలో మూడు చోట్ల కుడా బిజెపి సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ నాయకులు సహజంగానే ఉత్సాహంగా ఉన్నారు. అంటే అవి 17 అసెంబ్లీ సీట్లకు సమానం. బిజెపిపై ఈ ఉపఎన్నికలలో వ్యక్తమైన ప్రజల ఆగ్రహం డిసెంబర్ 7న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందని కాంగ్రెస్ ధీమాగా ఉంది.

అయితే కాంగ్రెస్ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కోసం మాజీ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్, పిసిసి అద్యక్షుడు సచిన్ పైలట్ ల మధ్య ప్రచ్చన్న పోరు సాగుతున్నది. యువనేత పైలట్ ను ముఖ్యమంత్రిగా చేయాలని పార్టీ అద్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నా గెహ్లాట్ పడనిస్తారా అన్నది ప్రశ్న.

గత ఎన్నికలలో బిజెపి 200 సీట్లలో 163 సీట్లు గెల్చుకొంది. ఇప్పటి వరకు రాజస్థాన్ చరిత్రలో అన్ని సీట్లను ఎవ్వరు గెల్చుకోలేదు. రాజస్తాన్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ పార్టీ అన్ని సీట్లు గెలుపొందలేదు. అత్యధికంగా 1998లో కాంగ్రెస్ గెల్చుకున్న సీట్ల కన్నా మరో 10 సీట్లు ఎక్కువగా గెల్చుకొంది. అయితే బిజెపికి సాంప్రదాయకరంగా మద్దతుదారులైన రాజపుత్, గుజ్జర్లలో బిజెపి ప్రభుత్వం పట్ల నెలకొన్న అసంతృప్తి కొన్ని సమస్యలు సృష్టించే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి వసుంధర రాజే తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే అసంతృప్తి మరోవంక పార్టీ నేతలలో, కార్యకర్తలలో నెలకొంది. శక్తి కేంద్ర సమ్మేళనాలు నిర్వహించడం ద్వారా పార్టీ అద్యక్షుడు అమిత్ షా నేరుగా పార్టీ కార్యకర్తలతో సమాలోచనలు జరిపి, వారిలో అసంతృప్తిని తొలగించే ప్రయత్నం కొంతమేరకు చేయగలిగారు. తమ అసంతృప్తి, ఇతర అంశాలను ప్రక్కన పెట్టి కష్టపడి పని చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో  ఏ పార్టీ కుడా వరుసగా రెండో సారి గెలుపొందలేదని అభిప్రాయాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసారు.

ఇక 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీ నెరవేర్చలేదని అసంతృప్తితో పాటు రాజస్తాన్ లో మొదటిసారిగా రైతుల ఆత్మహత్యలు వంటి అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయితే ప్రతికూల పరిస్థితులను ముందుగానే గ్రహించిన బిజెపి వాటిని అధిగమించడం కోసం వ్యూహాత్మకంగా కృషి చేస్తున్నది. అధికార పక్షం గెలుపొందలేదనే వారసత్వానికి వసుంధర రాజే బ్రేక్ కొట్టగలరా ? చూడవలసి ఉంది.