30 శాతం కరోనా కేసులు మర్కజ్‌తో ముడిపడినవే  

ప్రస్తుతం దేశాన్ని ఆవరించిన కరోనా మహమ్మారిలో  30 శాంత కేసులు  ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మర్కజ్‌తో ముడిపడి ఉన్నవే అని గుర్తించారు. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ ను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర వహించిన ఢిల్లీలో జరిగిన తబ్లీఘి జమాత్ సదస్సులో మొత్తం 16,500 మంది వరకు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. 

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో మార్చి 13 నుంచి 24 వరకు జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వారు దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో మరికొంత మంది వైరస్‌ బారినపడ్డారు. ఇక జమాతే హెడ్‌ క్వార్టర్స్‌ మర్కజ్‌ మసీదును ఆయా తేదీల్లో సందర్శించిన వారిని సెల్‌ఫోన్‌ డేటా ఆధారంగా గుర్తించామని జమాతే విచారణలో భాగమైన ఓ పోలీస్‌ అధికారి వెల్లడించారు.

ప్రార్థనల్లో పాల్గొన్నవారితో కాంటాక్ట్‌ అయిన 15 వేల మంది వివరాలు సేకరించడానికి బాగా శ్రమించాల్సి వచ్చిందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. వారందరినీ ట్రేస్‌ చేయడానికి అన్ని రకాల పోలీసుల సేవలను వినియోగించుకున్నామని చెప్పారు. ఇక మార్చి 24న నుంచి అమల్లో కొచ్చిన లాక్‌డౌన్‌తో కొందరు మర్కజ్‌లోనే చిక్కుకుపోవడంతో..  మార్చి 29 నుంచి 31 వరకు ఢిల్లీ పోలీసులు అక్కడున్న 2300 మందిని ఖాళీ చేయించారు. 

కాగా, తబ్లిగీ జమాత్ కార్యక్రమాన్ని లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్దంగా నిర్వహించడంపై తబ్లిగి జమాతే చీఫ్‌మౌలానా సాద్‌పై కేసు నమోదైన విషయం విదితమే. ఇప్పటికే సాద్‌పై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద కేసులు నమోదు చేయడంతో పాటు, తబ్లీగ్ జమాత్‌కు విదేశాల నుంచి మనీలాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించి హవాలా ద్వారా విరాళాలు సేకరించారని ఆరోపిస్తూ ఈడీ అధికారులు కూడా కేసులు నమోదు చేశారు.

దేశ వ్యాప్తంగా పోలీస్ బృందాలు ఈ కార్యక్రమం నుండి తిరిగి వచ్చిన వారిని గుర్తించి, వారితో పాటు వారిని కలిసిన వారిని కూడా వైద్య పరీక్షలకు తరలిస్తూ వస్తున్నారు.