కరోనా యోధులపై సాయుధ దళాల పూలవర్షం

కరోనా పోరాట యోధులకు అరుదైన గౌరవం లభించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థంగా, అవిశ్రాంతంగా సేవలందిస్తూ పోరాటం చేస్తున్న కరోనా యోధులకు కృతజ్ఞతలు తెలుపుతూ సాయుధ దళాలకు చెందిన జెట్స్‌, రవాణా విమానాలు, హెలికాఫ్టర్లు దేశవ్యాప్తంగా వందన సమర్పణ చేస్తున్నాయి. 

కరోనా రోగులకు సేవలందిస్తున్న కోవిడ్‌ ఆస్పత్రులపై హెలికాప్టర్లు పూల వర్షం కురిపిస్తున్నాయి. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా సాయుధ దళాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. 

ఢిల్లీ పోలీస్‌ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి సమర్పించి వందన సమర్పరణతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. పోలీసు సేవలకు ప్రశంసగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చాపర్‌ పోలీస్‌ వార్‌ మెమోరియల్‌పై పూలవర్షం కురింపించింది.

ఈ క్రమంలో భాగంగా మరోవైపు ఎయిర్‌ఫోర్స్‌ జెట్స్‌ దేశ నలుమూలల సరిహద్దుల వరకు ఫ్లై పాస్ట్‌ను నిర్వహిస్తున్నాయి. ఐఏఎఫ్‌ సీ-130జే సూపర్‌ హెర్యూలస్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ టాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్స్‌ రెండు జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ నుంచి బయల్దేరాయి. 

శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు మీదుగా ఛండీగర్‌లోని సుక్నా సరస్సు మీదుగా, దేశ రాజధాని ఢిల్లీపై ప్రయాణిస్తూ కేరళలోని త్రివేండం వరకు ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ చేరుకోనున్నాయి. ఆర్మీ బ్యాండ్స్‌ వైద్యశాలల వద్ద బ్యాండ్స్‌ను వాయిస్తూ దేశభక్తి గీతాలను ఆలాపిస్తున్నాయి. 

ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ సుకోయ్‌-30 ఎంకేఐ, మిగ్‌-29, జాగ్వార్‌ జెట్స్‌ సెంట్రల్‌ ఢిల్లీలోని రాజ్‌పథ్‌ మీదుగా ఎగిరి 30 నిమిషాల పాటు విన్యాసాలు చేసాయి. డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యురిటీ.. ఇలా ఆస్పత్రుల్లోని ప్రతి విభాగానికి కృతజ్ఞతలు తెలుపుతుంది. విశాఖలో చెస్ట్‌, గీతం ఆస్పత్రి, హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ బలగాల సంయుక్త విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 

వైద్యులు, వైద్య సిబ్బందికి సంఘీభావంగా సముద్రతీరాల్లో నౌకలు నిలిపిన నేవీ తమ కృతజ్ఞతను చాటుకుంది.  ప్రధాని పిలుపు మేరకు దేశప్రజలంతా మొదటిసారి బాల్కనీలో నిలబడి కరోనా యోధులకు సంఘీభావంగా చప్పట్లు చరిచారు. లైట్లను ఆర్పేసి దీపాలను వెలిగించారు. తాజాగా ఆరోగ్య సిబ్బంది సేవలను కొనియాడుతూ సంఘీభావంగా త్రివిధ దళాలు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి.