అధికారులపై వైసిపి ఎమ్యెల్యే నల్లపరెడ్డి వీరంగం!

మొత్తం అధికార యంత్రాంగం కరోనాపై యుద్ధం చేసుండగా, వారికి సహకరించవల్సింది పోయి, అధికార పక్షానికి చెందిన ఒక సీనియర్ ఎమ్యెల్యే, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అధికారుకారులపైననే యుద్దానికి దిగడం, పైగా సవాల్ చేస్తుండడం విస్మయం కలిగిస్తుంది. నేరుగా జిల్లా కలెక్టర్, ఎస్పీలపైననే పోరుబాట పట్టారు. 

కలెక్టర్ ను ఏక వాక్యంతో సంబోధిస్తూ, తీరు మార్చుకోకుంటే మర్యాదగా ఉండదని అంటూ మీడియా ముందే హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు జిల్లాల్లో గత కొద్దీ రోజులుగా అధికార పక్షంపై చెందిన ఇద్దరు, ముగ్గురు నేతలు ఇదే విధంగా జిల్లా అధికారులపై విరుచుకు పడుతున్నారు. అయినా ముఖ్యమంత్రి గాని, జిల్లా మంత్రి గాని పట్టించుకోవడం లేదు. 

ఇటీవల బుచ్చిలో కరోనా సాయం అందించే క్రమంలో పెద్ద సంఖ్యలో జనం గుంపులుకుదడంతో చట్టప్రకారం ఈ ఉల్లంఘనపై ఎస్పీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేపై బుచ్చిలో కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు జడ్పీ సీఈఓ, ఆర్డీఓ, స్పెషల్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, తహసీల్దారు, ఎమ్పీడీవోలు హాజరయ్యారు. 

144 సెక్షన్‌ అమలులో ఉన్నప్పుడు కరోనా వైరస్‌ వ్యాప్తికి అస్కారం కలిగించేలా ప్రజలు గుమికూడే అవకాశం ఉన్న కార్యక్రమాలకు మీరు ఎలా హాజరయ్యారు.. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వండి... అని కలెక్టర్‌ ఆ అధికారులకు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. ఇది ఎమ్మెల్యేకు కోపం తెప్పించింది.   

‘‘నేను పిలిస్తే నా కార్యక్రమానికి హాజరయ్యారు. మీకు దమ్ముంటే ఒక్క అధికారి మీద చర్య తీసుకోండి.. ప్రసన్న కుమార్‌రెడ్డి అంటే ఏమిటో చూస్తా’’  అంటూ ఎమ్మెల్యే రెచ్చిపోయి వీరంగం చేశారు.  మొదటి నుండి, రాష్ట్ర ప్రభుత్వంకన్నా ముందు నుండే, లాక్ డౌన్ కన్నా ముందు నుండే జిల్లా కలెక్టర్, ఎస్పీ అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎన్నో చర్యలు తీసుకొస్తూ జిల్లాను పెను ప్రమాదం నుండి కాపాడారు.