త్వరలో రెండో విడుత ఉద్దీపనల ప్యాకేజీ  

వ్యవసాయ రంగాన్ని సంస్కరించడంతోపాటు లాక్‌డౌన్‌ వల్ల దెబ్బతిన్న రంగాలకు త్వరలో రెండో విడుత ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించడంపై ప్రధాని మోదీ దృష్టిసారించారు. ఈ విషయమై ఆయన శనివారం హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా కీలక మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. 

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నెలవారీ వసూళ్ల గణాంకాల విడుదలను శుక్రవారం వాయిదా వేసిన ఆర్థిక మంత్రిత్వశాఖ దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితిని శనివారం ప్రధానికి వివరించడంతోపాటు ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు చేపట్టాల్సిన వివిధ రకాల చర్యలపై ప్రెజెంటేషన్‌ ఇచ్చింది. 

పౌరవిమానయాన, కార్మిక, విద్యుత్‌ తదితర శాఖల మంత్రులతో శుక్రవారం భేటీలు నిర్వహించిన మోదీ.. వాణిజ్య, ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల) శాఖల మంత్రులతో గురువారం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు చిన్న వ్యాపారాలు వేగంగా కోలుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టిసారిస్తూ మోదీ ఈ సమావేశాలను నిర్వహించారు.  

లాక్‌డౌన్‌ వల్ల అట్టడుగు వర్గాలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి నెలాఖరులో రూ. 1.7 లక్షల కోట్ల విలువైన ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్యాకేజీతో బడుగు, బలహీనవర్గాలకు కొంత ఉపశమనం లభించినప్పటికీ వ్యాపా ర, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం లభించలేదు. 

ఈ నేపథ్యంలో తమకూ చేయూతనివ్వాలని ఆయా వర్గాల నుంచి వినతులు రావడంతో త్వరలో రెండో విడుత ఉద్దీపన చర్యలను ప్రకటించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.