లాక్‌డౌన్‌ ఎత్తి వేసినా వుహాన్‌ లో కర్ఫ్యూ వాతావరణమే

కరోనా వైరస్ జన్మించిన చైనాలోని వుహాన్‌ నగరంలో లాక్‌డౌన్‌ అనంతరం కూడా కర్ఫ్యూ వాతావరణమే రాజ్యమేలుతున్నది.  కరోనా సృష్టించిన విలయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఇండ్ల నుంచి బయటకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు. కస్టమర్లు రాకపోవడంతో వ్యాపారస్థులు దుకాణాల్ని మూసివేస్తున్నారు. వైరస్‌ మరోసారి విరుచుకుపడొచ్చనే ఆందోళన ఆ నగరాన్ని పట్టిపీడిస్తున్నది. 

కొవిడ్‌-19 కేసులు క్రమంగా తగ్గాయని తెలుసుకున్న అధికారులు 76 రోజుల అనంతరం ఏప్రిల్‌ 8న వుహాన్‌లో లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. దీంతో మరుసటి రోజు నుంచి ప్రజలు  వీధుల్లోకి వస్తారని, నగరంలో దుకాణాలు తెరుచుకుంటాయని, వాణిజ్య కార్యకలాపాలు పునఃప్రారంభం అవుతాయని భావించారు. అయితే, వాళ్లు అనుకున్నట్టు ఏమీ జరుగలేదు. నగరంలో ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ చాలావరకు దుకాణాలు తెరుచుకోలేదు. 

ఇంట్లో నుంచి బయటకు రావడానికి స్థానికులు భయపడుతున్నారు. మాస్కులు ధరించి చాలా కొద్ది మంది మాత్రమే వీధుల్లోకి వస్తున్నారు. నిర్ణీత దూరం వంటి పద్ధతుల్ని  పాటిస్తున్నారు. కస్టమర్లు రాకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి. నగరంలో తెరుచుకున్న కొద్దిపాటి రెస్టారెంట్లు కూడా పార్సిల్‌ సర్వీసులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

మరోవైపు, స్టార్‌బక్స్‌, మెక్‌డొనాల్డ్స్‌, బర్గర్‌ కింగ్‌, కేఎఫ్‌సీ, పిజ్జాహట్‌ వంటి ప్రధాన ఆహార గొలుసు సంస్థలు కూడా తమ వ్యాపార విధానాన్ని, సర్వీసుల తీరుతెన్నుల్ని మార్చుకుంటున్నాయి. కస్టమర్లను స్టోర్ల లోనికి అనుమతించడం లేదు. స్టోర్‌ బయట కుర్చీలు వేసి, సిబ్బంది ద్వారా కావల్సిన ఆర్డర్లను అందజేస్తున్నాయి.

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కొన్ని రంగాలకు చెందిన వాణిజ్య కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయని, ఏప్రిల్‌ చివరినాటికి 100 శాతం ఉత్పత్తిని ప్రారంభిస్తామని స్థానిక ప్రభుత్వం చెప్పినప్పటికీ వుహాన్‌లో వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. 

లాక్‌డౌన్‌ ఎత్తివేతతో నగరంపై మరోసారి వైరస్‌ విరుచుకుపడొచ్చని చాలా మంది స్థానికులు, వ్యాపారస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం రెండోసారి లాక్‌డౌన్‌ను విధిస్తుందని, అదే జరిగితే ఆర్థిక వ్యవస్థపై మరో పిడుగు పడినట్టేనని భయపడుతున్నారు. 

ఇంకా అక్క‌డ  స్థానికంగా ఉండే ఆసుపత్రుల్లో  కరోనా వైరస్ జాడలు ఉన్నట్లు గుర్తించారు. వుహన్ నగరంలోని రెండు ఆసుపత్రుల గాలిలోని తుంపర్లలో కరోనాను గుర్తించినట్లు అక్క‌డి మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. దీనితో మరోసారి వుహన్‌లో అలజడి రేగింది.