కేంద్ర బృందం తీరుపట్ల సంజయ్ ఆగ్రహం 

గత నెల చివరిలో నాలుగు రోజులపాటు హైదరాబాద్ లో పర్యటించిన కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధ్యయన బృందం తెలంగాణలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న పరిష్టితుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన్నట్లు వచ్చిన వార్తల పట్ల కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆ బృందానికి తెలంగాణ ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను చూపించలేదని ధ్వజమెత్తారు. పైగా, బృందానికి తాము తగు ఆధారాలతో సమర్పించిన సమస్యలు, నివేదికలో  లేకపోవడం పట్ల కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి వ్రాసిన లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  

 తెలంగాణలో, కరోనా వైరస్ వ్యాప్తి, కోవిడ్ వ్యాధి చికిత్స తీరులను, వైధ్య సదుపాయాలను, సమీక్షించడానికి మరో కేంద్ర బృందాన్ని పంపించాలని ఆయన ఆ లేఖలో డిమాండ్ చేశారు.  కరోనా యొక్క  ప్రభావాన్ని తక్కువ చేసి చూపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు వాస్తవ పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకు రావలసిన నైతిక బాధ్యత తమపై ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. 

వాస్తవానికి, తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి పరీక్షలు చేయడం లేదని,  వ్యాధి కారక మూలాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయడం లేదని పేర్కొంటూ పూర్తి కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన గాంధీ ఆసుపత్రిలోని సౌకర్యాల గురించి తమకు వివిధ వర్గాల నుండి చాలా ఫిర్యాదులు వచ్చాయని సంజయ్ స్పష్టం చేశారు. 

ముఖ్యంగా ఆస్పత్రిలోని సరిపోను వాష్‌రూమ్‌లు లేకపోవడం, ఉన్నవాటిలో చాలా   సమస్యలు ఉండటం వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు. చాలావరకు గదులు, వార్డులకు ప్రత్యేక బాత్‌రూమ్‌లు లేదని, ఇంకా ఐసిఎంఆర్ ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం వాటిని నిర్వహించడం లేదని విమర్శించారు.  ప్రాంగణంలో పరిశుభ్రమైన పరిస్థితులు నిర్దేశించిన ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉన్నాయని, శిక్షణ పొందిన ఆరోగ్య నిపుణులు, సహాయక సిబ్బంది సరిపడా లేరని స్పష్టం చేసారు. 

కరోనా చికిత్స కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆసుపత్రిగా పేర్కొన్న, ఇక్కడ కొద్దిపాటి సౌకర్యాలు ఉంటే, కరోనా రోగులు చికిత్స పొందుతున్న రాష్ట్రం లోని ఇతర ఆసుపత్రులలో వసతులు ఈ విధంగా ఉంటాయో, బాగా ఊహించవచ్చని పేర్కొన్నారు. ఒక వైపు కనీస సౌకర్యాలు లేని ఆస్పత్రులు, మరొక వైపు కరోనా వైరస్ బారిన పడిన ప్రాంతాలలో రోగులను గుర్తించడంలో, పరీక్షించడంలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందుతున్నదని విమర్శించారు. 

కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్‌ను అనుసరించడంలో ఒక తీవ్రమైన లోపం జరుగుతున్నదని సంజయ్ ఆరోపించారు. సి.ఎస్. శాస్త్రి అనే 80 ఏళ్ల వ్యక్తి కరోనా అనుమానంతో ఏప్రిల్ 12 న గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. పరీక్ష తర్వాత అతన్ని నెగెటివ్‌గా ప్రకటించారు. నాలుగు రోజుల తరువాత అదే వ్యక్తిని మరొక ఆసుపత్రిలో (నిమ్స్) పరీక్షించినప్పుడు పోజిస్టివ్ గా ప్రకటించారు. 

తిరిగి గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా,  అక్కడ అతను ఏప్రిల్ 26 న తుది శ్వాస విడిచారని తెలిపారు. అయితే కేంద్ర బృందంపై ఇచ్చిన నివేదికలలో అతని మరణం చూపలేదని సంజయ్ వెల్లడించారు. 

ఈ ఉదంతం, ప్రభుత్వ ఉద్దేశాన్ని అనుమానించడానికి అవకాశం ఇస్తుందని పేర్కొంటూ తక్కువ సంఖ్యలో మరణాలు, తక్కువ సంఖ్యలో కేసులను ఎందుకు చూపించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు.