కర్నూల్, నరసరావుపేట లలో అదుపుతప్పుతున్న వైరస్ 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా రోజురోజుకు పెరుగుతూ ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,525కు చేరుకోగా ముఖ్యంగా కర్నూల్, నరసరావుపేట పట్టణాలలో ఈ వైరస్ అదుపుతప్పుతున్నట్లు కనిపిస్తున్నది. అహఁధికారుల నిర్లక్ష్యం, వివిధ శాఖల మధ్య సయోధ్య లోపించడమే అందుకు కారణంగా భావిస్తున్నారు. 

కర్నూల్ లో నగర పాలక సంస్థలో ఒక కీలక ఉన్నతాధికారికి పాజిటివ్ అని తేలడంతో మొత్తం జిల్లా యంత్రంగం ఉలిక్కిపడుతున్నది. ఆ అధికారి నిత్యం జిల్లాలోని కీలక అధికారులతో కలుస్తూ ఉండటం, జిల్లాస్థాయి సమావేశాలకు వెడుతూ ఉండడంతో ఆయన ద్వారా మరెవ్వరికీ సోకిందో అని ఆందోళన చెందుతున్నారు. 

ఆ ఉన్నతాధికారిని కలిసిన కనీసం వందమంది సీనియర్ అధికారులకు కరోనా పరీక్షలు జరపవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలువురు స్వచ్ఛందంగా పరీక్షా జరుపుకొంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు మూడోవంతు కేసులు కర్నూల్ జిల్లా నుండే ఉన్నాయి. మొత్తం 1525 కేసులలో కర్నూల్ జిల్లా నుండి 436 ఉన్నాయి. 

ఇక నరసరావుపేట పట్టణంలో ఎవ్వరెవ్వరికి, ఏ విధంగా ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చో తెలియక అధికార యంత్రంగం తికమకపడుతున్నది. ఇప్పటికే 125 మందికి సోకగా, వారిలో దాదాపు 100 మందికి సోకడానికి ఒక వ్యక్తి కారణమని భావిస్తున్నారు. 

లాక్ డౌన్ ప్రకటించిన 15 రోజుల వరకు ఒక పాజిటివ్ కేసు కూడా లేని ఈ పట్టణంలో గుంటూరు వెళ్లి వచ్చి తబ్లీఘి జమాత్ నుండి తిరిగివచ్చిన ఒకరిని కలిసిన ఒక కేబుల్ ఆపరేటర్ ఈ వైరస్ సోకి మృతి చెందడంతో మొత్తం పట్టణం ఖంగారు పడింది. 

మరణించేలోపు అతను యథేచ్ఛగా తిరుగుతూ ఉండడంతో, అతని ద్వారా మొదట ఒక హోమ్ గార్డ్ కు సోకడం, అతని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందడంతో అక్కడ నలుగురు వైద్యులతో సహా ఆసుపత్రి సిబ్బంది, అక్కడ చికిత్స పొందిన వివిధ మండలాల వారికి సహితం సోకింది. 

దాదాపు 540 మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. కరోనా పరీక్షల కోసం 450 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించారు. ఈ నమూనాలకు సంబంధించి నివేదికలు వస్తే మరి అనేకమంది వైరస్ సోకినవారి బైట పడవచ్చని అనుకొంటున్నారు.