మోడీ రూజ్ వెల్ట్ తరహా పాత్ర పోషించాలి

వి రాంమాధవ్ 

ప్రపంచమంతా కోవిద్-19 మహమ్మారితో తల్లడిల్లుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. ఆరోగ్య సంరక్షణ, ఆర్ధిక రంగాలు తీవ్ర వత్తిడిలో ఉన్నాయి. దేశాలన్నీ తమ తమ ప్రజలను రక్షించుకోవటానికి సరిహద్దులను మూసివేసి అంతర్ముఖమయ్యాయి.  చరిత్రకారుడు యువల్ నోహ్ హరారీ వ్రాసినట్టు మరిన్ని దేశాలు జాతీయవాద దేశాలుగా, సంరక్షణవాది దేశాలుగా, కొన్ని దేశాలైతే నిరంకుశవాద దేశాలుగా మారిపోతున్నాయి.

కరోనా వైరస్ వ్యాధి (కోవిద్-19) పరస్పరం  ఆధారపడే మరో పాఠాన్ని నేర్పింది. ఈ విశ్వ మహమ్మారి వ్యాధిపై పోరాటం కూడా విశ్వ వ్యాప్తంగా ఉండాలి. వైద్య పరికరాలు, సేవలు, రవాణా సదుపాయాలలు, చివరగా ఎప్పుడు కనుగొన్నా టీకాల కోసం మనం ఒకరి మీద ఒకరం ఆధారపడి ఉన్నాము.

మాస్కులు, పరీక్షా పరికరాలను మనం కొన్ని దేశాలనుండి దిగుమతి చేసుకొన్నాము. కరోనాపై పోరులో కీలకమైన హైడ్రోక్సీ క్లోరోక్విన్ వంటి మందులను అమెరికాతో సహా పలు దేశాలకు ఎగుమతి చేసాము. మందులు, వైద్య పరికరాల కొరకే కాకుండా ఆహార అవసరాలకు సైతం ప్రపంచ సరఫరా గొలుసులు ఎంతో కీలకంగా మారాయి. 

పూర్తిగా మూసుకొనే ధోరణితో ఉండే జాతీయవాదం పనిచేయదని ఈ మహమ్మారినుంచి దేశాలు గ్రహించాలి.  డోనాల్డ్ ట్రంప్ 'అమెరికా ప్రథమం' జాతీయవాదం పనిచేయలేదు. సరఫరాల కొరకు ఆయన చైనా, భారత్, దక్షిణ కొరియాల వైపు చూడవలసి వచ్చింది.

పలు రాజకీయ శాస్త్రకోవిదులు తరచుగా ప్రస్తావించే అమెరికా అత్యంత అసాధారణమనే వాదం పటాపంచలయింది. భారత్ తో సహా అన్ని దేశాలలోని ఒంటరితత్వ వాదులు గ్రహించవలసింది ఏమిటంటే కోవిద్-19 తదుపరి ప్రపంచం ఒంటరితత్వ వాదంతో కాకుండా మరింత అనుసంధానింపబడి ఉంటుంది.

కొద్ధి కాలంగా బహు ధ్రువ ప్రపంచం గురించి మాట్లాడే వ్యామోహం రాజకీయ శాస్త్ర కోవిదులలో పెరిగింది. కానీ 21వ శతాబ్దం కేవలం దేశాలచే నడిపించబడటం లేదు. కొన్ని దేశాలలో స్థూల జాతీయ ఉత్పత్తులను మించి ఆస్తులు కలిగి ఉన్న ప్రైవేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. జాతీయ సరిహద్దులను దాటి అపార ప్రభావం కలిగినవారు అనేకమంది ఉన్నారు.

మరీ ముఖ్యంగా, ఈ సామాజిక మాధ్యమాల యుగంలో దేశాల సరిహద్దుల్ని బేఖాతరు చేసే అనేక శక్తివంతమైన సమూహాలు ఉద్భవించాయి. ఓ వైపు జాతీయవాదం ఒక రాజకీయ సిద్ధాంతంగా మళ్లీ ప్రబలుతుండగా, పరాగ్ ఖన్నా అనే రచయిత పేర్కొన్నట్లు వైవిధ్య ధ్రువాల వైపు ప్రపంచం క్రమంగా జారిపోతున్నది.

కోవిద్-19 తరువాత ప్రపంచక్రమం ఎలా ఉంటుందనే భవిష్య వాణి చెప్పటం తొందరపాటు అని భావించినప్పటికీ, ప్రపంచం వివిధ దేశాలు, దేశేతర శక్తుల మార్గాలు ఒకదానికొకటి తాకుతూ సాగిపోతున్న వైవిధ్య ధ్రువ ప్రపంచంగా మారిపోతున్నదని ఖచ్చితంగా చెప్పవచ్చు.  

ఈ మహమ్మారి తదుపరి, అటువంటి బహు ధ్రువ ప్రపంచంలోకి భారత దేశాన్ని ప్రధాని నరేంద్రమోడీ నడిపించవలసి ఉంది. ప్రస్తుత పరిస్థితి ప్రపంచ యుద్ధాన్ని పోలి ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ వర్ణించారు. దాంతో రెండో ప్రపంచ యుద్ధంతో వర్ణనలకు ఉత్ప్రేరకం లభించింది.

మోడీని, అమెరికాని రెండో ప్రపంచ యుద్ధంలో నడిపించిన ఫ్రాంక్లిన్ డి రూజ్ వేల్ట్ తో పోలుస్తున్నారు. అమెరికాలో రూజ్ వేల్ట్, జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ ఒకే సంవత్సరంలో (1932లో) అధికారంలోకి వచ్చారు. హిట్లర్ యూరోపా లోని పొరుగు దేశాలను ఆక్రమణలకు గురిచేసి ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తే, రూజ్ వేల్ట్ అమెరికాని పునర్నిర్మించటంపై దృష్టి సారించాడు.

అమెరికాలో రూజ్ వెల్ట్ ప్రతిపాదించిన  'నూతన ఒప్పందం' భారీగా రహదారులు, వంతెనలు, రైల్వెల వంటి మౌలిక నిర్మాణాల వైపు దారితీసి, 1930లో సంభవించిన భారీ ఆర్ధిక మాంద్యం నుంచి అమెరికా బయటపడటానికి సహాయ పడింది. మోదీ కూడా అటువంటిదేదో చేస్తారని అంచనాలు ఉన్నాయి. 

డిసెంబర్ 1941లో జపాన్ పీర్ల్ హార్బర్ పై దాడి చేయటంతో రూజ్ వెల్ట్ యుద్ధంలోకి దిగక తప్పలేదు. 1945లో యుద్ధం ముగిసే సరికి, గ్రేట్ బ్రిటన్ స్థానాన్ని భర్తీ చేస్తూ అమెరికా ప్రపంచంలో ఓ ప్రధాన శక్తిగా అవతరించింది. యుద్ధంలో రూజ్ వెల్ట్ యోగదానం కేవలం ఆక్సిస్ పవర్స్ ని ఓడించటంలో మాత్రమే కాదు. రెండు ప్రపంచ సంస్థలను నిర్మించటంలో కీలక భూమిక పోషించారు.

1944లో బ్రెట్టన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ సంస్థల నిర్మాణానికి పునాది వేసారు. అమెరికన్ డాలర్ ప్రపంచ మారక ద్రవ్యంగా అవతరించింది. 1945లో అమెరికా దాని మిత్ర దేశాలు డ్రైవర్ సీట్లో ఉండేలా ఐక్య రాజ్య సమితి ఆవిర్భవించింది.

కోవిద్-19 తదుపరి ప్రపంచం గందరగోళంగా ఉండబోతున్నట్లు కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో, మోడీ రూజ్ వేల్ట్ తరహాలో నూతన ప్రపంచ సంస్థలను నిర్మించటంలో దారి చూపుతారని ఆసకలుగుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి వంటి రెండో ప్రపంచ యుద్ధం కాలంనాటి పాతకాలపు సంస్థలు ఈనాడు బాహాటంగా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ, వాటి విశ్వనీయతను కోల్పోయాయి.

"తన చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈనాడు ఐక్య రాజ్య సమితి అత్యంత తక్కువ విశ్వనీయతను కలిగి ఉన్నది" అని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఇటీవల పేర్కొన్నారు. అమెరికా అత్యంత పీడకలను ఎదుర్కొంటుండగా, చైనా నాయకత్వ విశ్వనీయత కనిష్ఠ స్థాయిలో ఉండగా, నరేంద్ర మోడీ రూజ్ వెల్ట్ తరహా పాత్రను పోషించాలని ఆశించటం తార్కికమే  అనిపిస్తుంది.

మోడీ డెబ్బై ఐదు సంవత్సరాలు వెనుకకు కాకుండా బహుశా నూరు సంవత్సరాలు వెనుకకు వెళ్లి మొదటి ప్రపంచ యుద్ధం చివరి సమయంలో వుడ్రో విల్సన్ పోషించిన పాత్రను చూడాలి.

మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా ఆశయం భౌతిక సంపదను కూడగొట్టుకోవటం కాదు, అన్ని దేశాలను సరియైన ఆశయాల దిశగా క్రొత్త అంతర్జాతీయ సమాజంగా వ్యవస్థీకరించటమేనని విల్సన్ భావించాడని  రాజకీయ శాస్త్రజ్ఞుడు జోసెఫ్ న్యే పేర్కొన్నాడు.

జనవరి 1918లో విల్సన్ అమెరికా కాంగ్రెస్ లో ప్రపంచ శాంతి కోసం ప్రశస్తమైన '14 అంశాల చార్టర్' (సంఘ నియమావళి) ఉద్ఘాటించటం అమెరికా నైతిక నేతృత్వాన్ని నొక్కి చె ప్పింది. 

20వ శతాబ్దంలోని విల్సనిజం అంటే ఉదారవాద అంతర్జాతీయవాదం, ప్రజాస్వామ్యం, విదేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, సమిష్టి భద్రత, మానవత్వంతో కూడిన సహకారం అని గుర్తించబడింది. మోదీ గత ఆరు సంవత్సరాలుగా ఈ రాజకీయ ఆదర్శాలన్నీటిపట్ల నిబద్ధతను కనపరిచారు.

జి-20 దేశాలతో, దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి సమావేశంలోనూ కోవిద్-19 సంబంధిత సంప్రదింపుల సమయంలో "మానవ కేంద్రిత అభివృద్ధి సహకార" నమూనాని ప్రస్తావించారు. కోవిద్-19 వ్యతిరేక పోరులో మోడీ కనపరచిన ప్రజాస్వామ్య పంధా, మానవతావాద విశ్వనీయతలు 21శతాబ్దంలో కోవిద్ తదుపరి కాలంలో మోదీ ఇజంగా గుర్తించబడవచ్చు. 

(రాం మాధవ్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ గోవేర్నర్స్ సభ్యులు)   

(హిందూస్తాన్ టైమ్స్ సౌజన్యంతో)