రూ 28,000 కోట్లకు పడిపోయిన జీఎస్టీ వసూళ్లు 

ప్రతి నెలా సుమారు లక్ష కోట్ల రూపాయల వరకు ఉండే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఇవి రూ.28,309 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో ఇవి రూ.1.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. 

జీఎస్టీ అనేది వినియోగ​ ఆధారిత పన్ను కావడంతో ఆర్ధిక కార్యకలాపాలు స్తంభించడంతో ఈ వసూళ్లు కూడా సన్నగిల్లాయి.  . లాక్‌‌‌‌డౌన్‌‌‌‌కు ముందు కూడా కరోనా ప్రభావంతో వ్యాపారాలు కాస్త సన్నగిల్లిన సంగతి తెలిసిందే. జీఎస్టీ లెక్కల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూలు కూడా భారీగా తగ్గినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ), రాష్ట్ర జీఎస్టీ (ఎస్‌‌‌‌జీఎస్టీ) వసూళ్లు రికార్డు కనిష్ట స్థాయిల్లో రూ.5 వేల కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నాయి. మార్చి నెల కలెక్షన్లకు జీఎస్టీ పేమెంట్లు జరిపే తుది గడువు ఏప్రిల్ 20గా ఉంటుంది. కరోనా కారణంతో ప్రభుత్వం 15 రోజులు వడ్డీలేని  గ్రేస్ పిరియడ్ ఇచ్చి, దీన్ని ఈ నెల 5 వరకు పొడిగించింది. 

చాలా మంది పన్ను చెల్లింపుదారులు గ్రేస్ పిరియడ్ పొడిగింపును ఎంపిక చేసుకున్నారు.   అదే ఈ నెల 5 తర్వాత, జూన్ 30 వరకు రిటర్నులు దాఖలు చేసే వారు 9 శాతం వడ్డీని చెల్లించాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు. రాబోయే నెలల్లో వసూళ్లలో  పెరుగుదల ఉంటుందా? అనే ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పడం కష్టంగా మారింది. 

అయితే జీఎస్టీ కలెక్షన్స్ భారీగా తగ్గిపోవడం సాధారణమేనని, రవాణా లేకపోవడం, కేవలం అత్యవసర వస్తువులు మాత్రమే అమ్మకానికి ఉండటంతో వసూళ్లు తగ్గినట్టు చెబుతున్నారు. అదేవిధంగా చాలా వ్యాపారాలు జీఎస్టీ చెల్లింపుల్లను వాయిదా వేసాయి.