అమరావతి నిర్మాణంలో విదేశీ కంపెనీలు కనిపించవే !

నవ్యంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచంలోనే ఉత్తమమైన నగరంగా నిర్మిస్తానంటూ నాలుగేళ్లుగా సింగపూర్ కంపెనీలు తయారు చేసిన ఊహా చిత్రాలకు విస్తృత ప్రచారం కలిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరా నిర్మాణం పనులు అప్పగించడానికి మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒక్క నిర్మాణ కంపెనీని కూడా పొందలేక పోయారు. చివరికి మనదేశంలోనే కాంట్రాక్టు దారులకే పనులు అప్పచెప్పా వలసి వస్తున్నది.

గతంలో ఒక సందర్భంలో మనదేశంలోని కాంట్రాక్టుదారులు కేవలం స్లమ్స్ (మురికివాడలు) నిర్మించడానికి మాత్రమే పనికి వస్తారని, తాను స్లమ్స్ నిర్మించ దలఁచు కోవడం లేదని అంటూ నిర్మాణం పనులు చేపట్టే వారి కోసమని పలు దేశాలలో స్వయంగా పర్యటనలు జరిపారు. సింగపూర్, ఆస్తానా, జపాన్, చైనా వంటి దేశాలలో తనకు జరుపుతున్న పర్యటనలు అన్ని రాజధాని నిర్మాణాలకు విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకే అంటూ చెప్పుకొచ్చారు కూడా. పైగా, సింగపూర్ కంపెనీలే రాజధాని నిర్మిస్తున్నాయని, తన అనుభవం, తన విశ్వసనీయతలను చూసి ముచ్చట పది అవి అందుకోసం ముందుకు వచ్చాయని కూడా ప్రచారం చేసుకున్నారు.

రాజధానిలో కొన్ని ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం అంటూ టెండర్లు పిలిస్తే ఒక్కటంటే ఒక్క విదేశీ సంస్థ కూడా ముందుకు రాలేదు. కొత్తగా కట్టబోతున్న సచివాలయం, హై కోర్ట్ భవనాలు, వసతి గృహాలు ... అన్నింటిని స్వదేశీ కాంట్రాక్టుదారులతోనే నిర్మించే ప్రయత్నం చేటున్నారు. వారికే నిర్మాణ పనులు అప్పచెబుతూ టెండర్లను ఖరారు చేస్తున్నారు. వాటిల్లో హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.

రాజధాని నిర్మాణం కోసం అంటూ పలు విదేశాలలో పర్యటనలు జరిపిన ముఖ్యమంత్రి ఏమి చేసుకొంటూ వచ్చారని ఇప్పుడు అనుమానాలు చెలరేగుతున్నాయి. గతంలో సింగపూర్ కంపెనీలు ఉదారంగా తనను చూసి డిజైన్ లను తయారు చేశాయంటూ ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడా డిజైన్ లను గాలికి వదిలి వేసిన్నట్లే కనిపిస్తున్నది. అమరావతి పేరుతో ప్రచార ఆర్భాటాలు తప్ప ఆచరణలో జరుగుతున్నది మాత్రం వేరని స్పష్టం అవుతున్నది.

ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కంపెనీలు, స్థిరాస్తి వ్యాపారులకు పెద్ద ఎత్తున భూములు కేటాయించడం పట్ల చూపుతున్న శ్రద్ద రాజధాని నిర్మాణం పట్ల కనిపించడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి.