మే 3న కరోనా వారియర్స్‌కు సైన్యం సంఘీభావం

కరోనా వారియర్స్‌కు సంఘీభావం తెలుప‌డానికి మే 3న త్రివిధ ద‌ళాలు ప్ర‌త్యేక కార్యక్ర‌మాలు నిర్వహించ‌బోతున్నాయ‌ని  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్  తెలిపారు.కరోనా కష్ట కాలంలో ముందుండి పోరాడిన ప్రతీ ఒక్కరికీ డిఫెన్స్ తర‌ఫున‌ కృతజ్ఞతలు తెలుపుతున్నామ‌ని త్రివిధ దళాధిపతులతో కలిసి  మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ఎయిర్‌ఫోర్స్ నేతృత్వంలో శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు, దిబ్రుఘర్ నుంచి గుజరాత్‌లోని కచ్ వరకు వైమానిక దళాల ఫ్లై పాస్ ఉంటుంద‌ని చెప్పారు. ఆ స‌మయంలో విమానాల ద్వారా కొవిడ్‌-19 ఆస్ప‌త్రుల‌పై పూల‌ను వెద‌జ‌ల్ల‌నున్న‌ట్లు తెలిపారు. 

అదేవిధంగా నేవీ కూడా మే 3న‌ యుద్దనౌకలను పూర్తిగా లైటింగ్‌తో అలంకరించి కరోనా వారియర్స్‌కు సంఘీభావం తెలుపుతుందన్నారు. నేవీ చాప‌ర్స్ నుంచి కొవిడ్‌-19 ఆస్ప‌త్రుల‌పై పూల‌వ‌ర్షం కురిపిస్తాయ‌ని చెప్పారు. వైద్యులు, నర్సులు, ఇత‌ర వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా ఇలా అందరికీ త్రివిధ ద‌ళాల త‌ర‌ఫున ఆయ‌న కృతజ్ఞతలు తెలిపారు. 

ఇక ఆర్మీ త‌న‌వంతుగా మౌంటెయిన్ బ్యాండ్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తుంద‌ని పేర్కొన్నారు. క‌రోనాపై పోరు సాగిస్తున్న వేళ భార‌త ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు త‌మ వంతు స‌హాయం అందించ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని సీడీఎస్ రావ‌త్ చెప్పారు. 

ఇలా ఉండగా, జీవయుద్ధం (బయోవార్‌ఫేర్‌) కారణంగానే కరోనా వైరస్‌ ఉనికిలోకి వచ్చిందని చెప్పలేమని బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. ఆ విధంగా నిర్ధారించటం సరైనది కాదని చెప్పారు. వైరస్‌ ఎలా పుట్టిందన్నది తెలుసుకోవటానికి ఇంకాసమయం పడుతుందని తెలిపారు.