ఏపీలో మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ 

కేంద్ర ప్రభుత్వం కొంచెం సడలింపు ఇవ్వగానే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్,  ఆరెంజ్ జోన్ల‌లో ఈ నెల 4 నుంచి మ‌ద్యం అమ్మ‌కాలు ప్రారంభించాల‌ని నిర్ణయించింది.  అయితే మే-17 వ‌ర‌కు పొడిగించిన‌ లాక్ డౌన్ పూర్త‌య్యేవ‌ర‌కు మ‌ద్యం షాపులు మాత్రమే తెర‌వాల‌ని,  బార్స్ అండ్ రెస్టారెంట్స్ తెర‌వ‌కూడ‌ద‌ని స్పష్టం చేసింది. 

 జోన్ల విషయంలో దేన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లాలను యూనిట్‌గా తీసుకుంటే ఐదు జిల్లాలు రెడ్‌ జోన్‌ లో ఉన్నందున అక్కడ అమ్మకాలు జరగవు. మండలాలను యూనిట్‌గా తీసుకుంటే అన్ని జిల్లాల్లోనూ రెడ్‌ జోన్‌ మండలాలను  మినహాయించి మిగిలిన మండలాల్లో మద్యం విక్రయించే అవకాశముంది. 

దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ గడువును కేంద్రం మరో రెండు వారాలపాటు పొడిగిస్తూ రెడ్ జోన్లలో లాక్ డౌన్ కఠినంగా అమలు కానుండగా,  గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా గ్రీన్ ,  ఆరెంజ్ జోన్ల పరిధిలోని పాన్ షాపులు, లిక్కర్ షాపులు అమ్మకాలు చేపట్టవచ్చని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

అయితే మద్యం అమ్మకాలకు కేంద్రం నిబంధనలను విధించింది. షాపుల దగ్గర ఐదుగురి కంటే ఎక్కువగా ఉండొద్దని, ఒకోక్కరి మధ్య రెండు గజాల దూరాన్ని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.కేంద్రం ఆదేశాలతో మే 4 నుంచి గ్రీన్ జోన్లలో లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. కానీ రాష్ట్రాలు కూడా దీనికి అంగీకారం తెలపాల్సి ఉంటుంది.